Vaarasudu Trailer Released: తమిళ హీరో తలపతి విజయ్ నటించిన సినిమా ‘వారిసు’. దీన్ని వారసుడు పేరుతో తెలుగులో కూడా డబ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా తమిళ, తెలుగు ట్రైలర్లను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, యాక్షన్ ఇలా అన్నిటినీ రంగరించి ఈ థియేట్రికల్ ట్రైలర్‌ను కట్ చేశారు. అయితే ఇప్పటికే వచ్చిన అనేక తెలుగు సినిమాల షేడ్స్ ఇందులో కనిపిస్తున్నాయి. వెంకటేష్ ‘లక్ష్మి’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’, పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాలు కూడా ‘వారసుడు’లో కనిపిస్తున్నాయి. సినిమా ఎలా ఉండనుందనేది తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.
ఎస్.ఎస్.థమన్ స్వరాలు అందించిన పాటలు తమిళంలో ఇప్పటికే పెద్ద హిట్ అయ్యాయి. తెలుగులో మాత్రం ‘రంజితమే’, ‘సోల్ ఆఫ్ వారసుడు’ పాటలు మాత్రమే విడుదల అయ్యాయి. తమిళంలో వచ్చినంత రెస్పాన్స్ ఇక్కడ రాలేదు. తమిళంలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ కూడా జరిగింది. తెలుగులో ప్రమోషన్లకు హీరో విజయ్ హ్యాండిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
తెలుగులో ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ నటించిన ‘వీర సింహా రెడ్డి’లతో పోటీ పడనుంది. 'వారిసు' సినిమాలో 'థీ దళపతి' పాటను యువ తమిళ హీరో శింబు పాడిన సంగతి తెలిసిందే. పాడటమే కాదు ఆయన లిరికల్ వీడియో కోసం డ్యాన్స్ కూడా చేశారు. హీరోగా విజయ్ కెరియర్ స్టార్ట్ చేసి 30 ఏళ్ళు అవుతోంది. ఆయన జర్నీ సెలబ్రేట్ చేసేలా ఆ పాటను రూపొందించారు. దాంతో పాటు 'రంజితమే', 'సోల్ ఆఫ్ వారిసు' పాటలకు కూడా మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా 'రంజితమే' సాంగ్ రికార్డులు క్రియేట్ చేస్తోంది.
‘ఊపిరి’, ‘మహర్షి’ సినిమాల దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రమిది. 'వారిసు' సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్‌పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి. పొట్లూరి నిర్మిస్తున్నారు. విజయ్ సరసన రష్మిక మండన్న కథానాయికగా నటించారు.
తెలుగు థియేట్రికల్ రైట్స్ కాకుండా 'వారసుడు' మిగతా రైట్స్ అన్నీ కలిపి సుమారు 280 కోట్లకు ఇచ్చేశారట. సినిమా నిర్మాణానికి సుమారు 250 కోట్లు అవుతోందని వినబడుతోంది. ఆ లెక్కన విజయ్ సినిమాతో 'దిల్' రాజుకు 30 కోట్లు లాభమే. అది కాకుండా తెలుగు థియేట్రికల్ రైట్స్ ఉన్నాయి. ఎటు చూసినా దిల్ రాజు మంచి ప్రాఫిట్స్ అందుకుంటున్నారని ట్రేడ్ వర్గాల టాక్.
ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగి బాబు, సంగీత, సంయుక్త తదితరులు 'వారసుడు'లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లితో పాటు హరి, అహిషోర్ సాల్మన్ కథ, స్క్రీన్ ప్లేను అందించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని కూర్పు: కె.ఎల్. ప్రవీణ్, సహ నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత.