ఆహా ఓటీటీ వేదికలో 'తెలుగు ఇండియన్ ఐడల్ 2' (Telugu Indian Idol 2) త్వరలో షురూ కానుంది. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేశారు. వైబ్రెంట్ కలర్ డ్రస్సులో తమన్ (Thaman) షూటింగ్ స్పాట్ దగ్గర కనిపించారు. ఫస్ట్ సీజన్ కూడా ఆయన చేశారు. న్యాయ నిర్ణేతగా కనిపించారు. రెండో సీజన్‌లో కూడా ఆయన ఉన్నారు. మరి, మిగతా న్యాయ నిర్ణేతలు & హోస్ట్ సంగతి ఏంటి? అంటే... 'తెలుగు ఇండియన్ ఐడల్ 2'కు కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయ్!  


నిత్యా మీనన్ ప్లేసులో గీతా మాధురి!
నటిగా విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న కథానాయిక నిత్యా మీనన్. 'తెలుగు ఇండియన్ ఐడల్'లో ఆమె న్యాయ నిర్ణేతగా కనిపించారు. ఈసారి ఆమె లేరు. నిత్యా మీనన్ స్థానంలో ప్రముఖ గాయని గీతా మాధురి (Geetha Madhuri)ని తీసుకు వచ్చారు. 


''కమర్షియల్ పాటల రారాణి. కమర్షియల్ సినిమా అయినా, లవ్ స్టోరీ అయినా, మాస్ బీట్ అయినా మెలోడీ అయినా, తన పాటలకి కనెక్ట్ అవ్వని వారుండరు'' అంటూ ఆహా టీమ్ ఈ విషయాన్ని వెల్లడించింది. 


నిత్యా మీనన్ కేవలం కథానాయిక మాత్రమే కాదు. ఆమెలో మంచి గాయని కూడా ఉన్నారు. పాటలు పాడటంతో పాటు కొన్ని సినిమాల్లో ఇతర కథానాయికలకు డబ్బింగ్ కూడా చెప్పారు. ఇప్పుడు నిత్యా మీనన్ ప్లేసులో గీతా మాధురిని తీసుకు వచ్చారని చెప్పడానికి కారణం ఏంటంటే... ఫస్ట్ సీజన్ న్యాయ నిర్ణేతలు తమన్, సింగర్ కార్తీక్ ఈ సీజన్ కూడా చేస్తున్నారు. ఒక్క నిత్యా మీనన్ మాత్రమే మిస్సింగ్. 


Also Read : ప్రేమికుల రోజున స్టార్ హీరోయిన్లు ఎక్కడ ఉన్నారు? ఎవరితో ఉన్నారంటే?






హోస్ట్ కూడా మారారండోయ్!
న్యాయ నిర్ణేతలలో నిత్యా మీనన్ మిస్సింగ్ అయితే... 'తెలుగు ఇండియన్ ఐడల్' ఫస్ట్ సీజన్ హోస్ట్ చేసిన సింగర్ శ్రీరామ చంద్ర కూడా ఈ సీజన్‌లో మిస్సింగ్ అని చెప్పాలి. అతడి బదులు మరో సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టుగానూ దూసుకు వెళ్తున్న హేమచంద్రను తీసుకు వచ్చారు. గతంలో సింగింగ్ షోలకు హోస్ట్ చేసిన అనుభవం అతడికి ఉంది.  


''తెలుగు ఆడియన్స్ తో అతనికున్న దోస్తీ, పాటలతో అందరిని ఫిదా చేసే స్వరం అతని ఆస్తి'' అని హేమచంద్రకు ఆహా వెల్కమ్ చెప్పింది. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలోని దోస్తీ పాటను హేమచంద్ర పాడారు. 


Also Read  స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా?






Thaman spotted on the sets of Aha Telugu Indian Idol 2 : 'తెలుగు ఇండియన్ ఐడల్ 2' షూటింగ్ స్పాట్‌లో సంగీత దర్శకుడు తమన్ కనిపించారు. ఈ మధ్య తమన్ స్టైలిష్ డ్రస్సింగ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పుడీ షూటింగుకు కూడా ఆయన సూపర్ స్టైలిష్‌గా వచ్చారు. 


'తెలుగు ఇండియన్ ఐడల్' ఫస్ట్ సీజన్ గత ఏడాది జూన్ నెలలో ముగిసింది. అది సుమారు 15 వారాల పాటు సాగింది. అందులో వాగ్దేవి విజేతగా నిలిచింది. ఆ ఫైనల్ ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. వాగ్దేవి పాడిన 'ఆట కావాలా... పాట కావాలా'కు ఆయన మెస్మరైజ్ అయ్యారు. తన సినిమాలో ఓ పాట పాడే అవకాశం వాగ్దేవికి ఇస్తానని ఆయన చెప్పారు.