Diljit Dosanjh Music Concert In Hyderabad: పంజాబీ గాయకుడు, ప్రముఖ నటుడు దిల్జీత్ దోసాంజ్ (Diljit Dosanjh) శుక్రవారం హైదరాబాద్‌లో 'దిల్ - లుమినాటి' (Dil Luminati) సంగీత కచేరీ నిర్వహించనున్నారు. అయితే, కార్యక్రమానికి ముందు తెలంగాణ ప్రభుత్వం నటుడు దల్జీజ్ సహా కచేరీ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో డ్రగ్స్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోన్న వేళ మద్యం, డ్రగ్స్ ప్రొత్సహించేలా ఎలాంటి పాటలు పాడొద్దని హెచ్చరించింది. దోసాంజ్ మ్యూజిక్ కన్సర్ట్‌లో వీటిపై పాటలు పాడడం సర్వ సాధారణం కావడంతోనే సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, హింసను ప్రోత్సహించేలా పాటలు పాడొద్దని.. ప్రదర్శన సమయంలో 'పిల్లలను ఉపయోగించవద్దని' నోటీసుల్లో పేర్కొంది. పెద్ద శబ్దాలు, ప్లాషింగ్ లైట్లు పిల్లలకు హానికరం కనుక వాటిని ఉపయోగించొద్దని కోరింది. కాగా, దోసాంజ్ గతంలో డ్రగ్స్, మద్యంపై పాడిన పాటల వీడియో సాక్ష్యాలను చండీగఢ్‌కు చెందిన పండిట్‌రావ్ ధరేన్వర్ సమర్పించిన క్రమంలో అప్రమత్తమైన ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
గతంలో ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం, జైపూర్‌తో పాటు పలు అంతర్జాతీయ వేదికలపైనా 'దిల్ లుమినటీ' కన్సర్ట్‌లో దోసాంజ్ ఇలాంటి పాటలే పాడారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ కార్యక్రమ వీడియోలను ఈ నోటీసులకు పోలీసులు జత చేశారు. కాగా, దిల్ లుమినటీ టూర్ దేశవ్యాప్తంగా 11 నగరాల్లో గత నెల 26న ప్రారంభమైంది. ఇందులో భాగంగానే శుక్రవారం హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహించనున్నారు. టికెట్లు సైతం భారీగా అమ్ముడయ్యాయి. హైదరాబాద్ తర్వాత, అతను అహ్మదాబాద్, లక్నో, పూణే, కోల్‌కతా, బెంగళూరు, ఇండోర్, చండీగఢ్, గౌహతిలలో ప్రదర్శన ఇవ్వబోతున్నాడు. డిసెంబర్ 29న గౌహతిలో ప్రదర్శనతో కచేరీ ముగుస్తుంది. తన ఎంగేజింగ్ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలకు పేరు గాంచిన దిల్జిత్ తన అభిమానులతో, ముఖ్యంగా దీపావళి సందర్భంగా, పండుగ వేడుకలను సంగ్రహించే వినోదభరితమైన పోస్ట్‌లను పంచుకున్నప్పుడు అతని అభిమానులకు మరింత చేరువయ్యాడు.