‘RRR’ సినిమాతో ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటారు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ఈ సినిమా, ఏకంగా రూ. 1200 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది.  ఇప్పటికే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సినిమా అవార్డులను అందుకున్న ఈ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ సినిమాకు చెందిన ‘నాటు నాటు’ పాట నామినేట్ అయ్యింది. అందరూ ఈ సినిమాకు ఆస్కార్ వచ్చి తీరుతుంది అని దీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్కార్ అవార్డు కోసం ‘RRR’ సినిమా టీమ్ పెడుతున్న ఖర్చుతో ఏకంగా 8 సినిమాలు తియ్యొచ్చని చెప్పారు.


ఆ ఖర్చుతో 8 సినిమాలు తీయ్యొచ్చు- భరద్వాజ


హైదరాబాద్ రవీంద్రభారతి ప్రివ్యూ థియేటర్‌  ‘వివాదాస్పద విషయాలపై సినిమాల నిర్మాణం’ అనే అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న భరద్వాజ పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ‘RRR’ సినిమా బృందం ఆస్కార్ కోసం చేస్తున్న ఖర్చుపై షాకింగ్ కామెంట్స్ చేశారు.  ఆస్కార్ కోసం పోటీ పడుతున్న ‘RRR’ సినిమా టీమ్ విమాన ఖర్చులకు పెట్టిన డబ్బుతో 8 సినిమాలు తియ్యొచ్చని చెప్పారు. "‘RRR’ సినిమా కోసం రూ. 600 కోట్ల బడ్జెట్ అయింది. మళ్లీ ఆస్కార్ కోసం రూ.80 కోట్లు ఖర్చు పెట్టారు. అదే రూ.80 కోట్లతో 8 సినిమాలు చేయొచ్చు. వాళ్లు ఊరికే ఫ్లైట్ టికెట్లకు రూ.80 కోట్లు ఖర్చు పెట్టారు" అని భరద్వాజ అన్నారు.






రాజమౌళి అనుకున్నది సాధించాడు - భరద్వాజ


ఇక ప్రస్తుతం ప్రస్తుతం సినీ పరిశ్రమతో పాటు సినిమా వ్యాపారంలో సామాజిక స్పృహా లోపించిందని భరద్వాజ అభిప్రాయపడ్డారు.  “బాహుబలి సినిమా కోసం ఆ రోజుల్లో రూ. 200 కోట్ల బడ్జెట్ పెట్టారు. బుర్ర ఉన్న వాడు ఎవరూ ఆ పని చేయడు అని అనుకున్నాను. కానీ, రాజమౌళి అనుకున్నది సాధించాడు. సక్సెస్ ఫుల్ ఫిల్మ్ తీశాడు. మంచి కథ ఉంటే బడ్జెట్ అనేది పెద్ద సమస్య కాదు. దిల్ రాజో బోడి రాజో ఎవరు ఉంటారు. వాళ్లు కథ తీసుకోకపోతే అప్పో సప్పో చేసి సినిమా తీయండి. ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు.  సక్సెస్ వస్తే గొప్పోళ్లు అవుతారు. రాకపోతే మాలాగా మిగిలిపోతారు” అన్నారు. ఇక సినిమాలను తీసేసి ప్రేక్షకులకు ఏదో నేర్పించాలని, వాళ్లను మార్చాలని కాదని చెప్పారు. మనకు నచ్చినట్లు మనం సినిమా తీయాలన్నారు. ‘RRR’ లాంటి సినిమాలను తాము చేయలేమని, కేవలం చూస్తాని చెప్పారు. ప్రస్తుతం భరద్వాజ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   






Read Also: అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన హిట్, ఫ్లాప్ మూవీస్ ఇవే? బన్నీ ఫ్యాన్స్ షాకవ్వడం పక్కా!