చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడం లేదంటూ వస్తున్న విమర్శలపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంటి మనిషి అయిన జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు కావాలని దూరం చేసుకున్నారని చెప్పారు. సినిమా పరిశ్రమలో ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ కు సమాన స్థాయి ఉందన్న ఆయన, పవన్ ను దగ్గరికి తీసుకుని ఎన్టీఆర్ ను దూరం పెట్టారని విమర్శించారు. ఎన్టీఆర్ ను వదులుకోవడంతోనే టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భరద్వాజ, టీడీపీ రాజకీయాలు, చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ పట్ల వ్యవహరించిన తీరుపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
పార్టీ కోసం ప్రాణాలు అడ్డేసిన ఎన్టీఆర్ ను పట్టించుకోలేదు!
2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీ కోసం ఎంతో కష్టపడ్డారని చెప్పారు భరద్వాజ. ఎన్నికల ప్రచారంలో శక్తివంచన లేకుండా దూసుకెళ్లరన్నారు. చివరకు తన ప్రాణాలను పణంగా పెట్టి పార్టీ కోసం పని చేశారని చెప్పారు. చావు బతుకుల మధ్య హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారని చెప్పారు. అంతలా కష్టపడి పని చేసిన జూనియర్ ఎన్టీఆర్ ను 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదని చెప్పారు. పవన్ కల్యాణ్ కోసం గంటల తరబడి వెయిట్ చేసి మరీ ఆయనతో పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ దారుణ పరిస్థితికి కారణం చంద్రబాబు
ప్రస్తుతం టీడీపీ పరిస్థితి మరింత దారుణంగా తయారైందన్నారు భరద్వాజ. పక్క పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టీడీపీని ఆదుకోవాల్సి వస్తుందన్నారు. ఎంత కష్టపడ్డా పవన్ కల్యాణ్ ఇతర పార్టీ అధ్యక్షుడు అవుతారు తప్ప, టీడీపీ సొంత మనిషి కాలేరని చెప్పారు. పవన్ కల్యాణ్ అభిమానులు కూడా టీడీపీకి ఓట్లు వేసే పరిస్థితి లేదన్నారు. ఇంకా చెప్పాలంటే గత ఎన్నికల్లో జనసేనకు కూడా పవన్ అభిమానులు ఓట్లు వేయలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలన్నారు. ఎవరు ఏం చెప్పినా ఈ రోజు టీడీపీ బలహీన స్థితికి చేరుకోవడానికి కారణం చంద్రబాబు నాయుడని భరద్వాజ కుండ బద్దలు కొట్టారు. జూనియర్ ఎన్టీఆర్ ను ఎన్ని రోజులు దూరం పెడితే, టీడీపీకి అంత నష్టం అని చెప్పారు. ప్రస్తుతం తమ్మారెడ్డి వ్యాఖ్యలు ఇటు సినిమా పరిశ్రమలో, అటు ఏపీ రాజకీయాల్లో సంచలనం కలిగిస్తున్నాయి.
ఎన్టీఆర్ పై బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు
ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సంచనల వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్టుపై సినిమా వాళ్లు స్పందించకపోవడాన్ని పట్టించుకోబోనని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ అన్నారు. తెలంగాణలో టీడీపీ లేదు అన్న వారికి తామేంటో చూపిస్తామని హెచ్చరించారు.
Read Also: త్రివిక్రమ్ ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై నిర్మాత నాగవంశీ ఏమన్నారంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial