కోలీవుడ్ హీరో విశాల్ మరోసారి తీవ్రంగా గాయపడ్డారు. తన తదుపరి సినిమా యాక్షన్ సీక్వెల్స్ లో పాల్గొన్న ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. విశాల్ హీరోగా దర్శకుడు శరవణన్ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి 'నాట్ ఏ కామన్ మ్యాన్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో భాగంగా విశాల్ పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ లో బలంగా గోడను ఢీకొని కిందపడిపోయారట విశాల్.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రమాదంలో విశాల్ వెన్ను భాగానికి దెబ్బ తగిలింది. దీంతో వైద్యులు ఆయనకి ట్రీట్మెంట్ అందించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చిత్రబృందం తెలిపింది. గతంలో కూడా ఈ సినిమా షూటింగ్ సమయంలో తీవ్రంగా గాయపడ్డారు విశాల్. విలన్ తో ఫైట్స్ చేసే సమయంలో విశాల్ పై గాజు బాటిల్స్ ను విసిరేస్తూ ఉంటారు. ఈ సీన్స్ షూట్ చేస్తున్నప్పుడు విశాల్ తలకు, కంటికి స్వల్ప గాయాలయ్యాయి. ఇది జరిగిన కొన్ని రోజులకే విశాల్ మరోసారి గాయాలపాలవ్వడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
విశాల్ కెరీర్ విషయానికొస్తే.. తమిళ సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆయన.. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక్కడ ఆయన సినిమాలకు ఆదరణ దక్కడంతో స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేయడానికి ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఆయన చేసిన 'సెల్యూట్' సినిమా బోల్తా కొట్టింది. అయితే విశాల్ మాత్రం తన ప్రయత్నాలు మానుకోలేదు. సరికొత్త ప్రయోగాలు చేస్తూ.. ప్రేక్షకులను అలరించడానికి కృషి చేస్తున్నారు.
అయితే ఈ మధ్యకాలంలో ఆయన నటించిన 'యాక్షన్', 'చక్ర' సినిమాలు నిరాశనే మిగిల్చాయి. దీంతో విశాల్ మరోసారి తన కెరీర్ పై దృష్టి పెట్టారు. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో 'విశాల్ 31' సినిమాను మొదలుపెట్టాడు. ఈ సినిమా స్టంట్స్ చేస్తున్న సమయంలోనే విశాల్ గాయపడ్డారు. ట్రీట్మెంట్ తీసుకున్న అనంతరం ఈ హీరో షూటింగ్ లో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాతో పాటు విశాల్ 'ఎనిమీ' అనే సినిమాలో నటిస్తున్నాడు. దీన్ని ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో విశాల్ కి ధీటుగా విలన్ పాత్రలో ఆర్య కనిపించనున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్ లు కాకుండా 'డిటెక్టివ్' సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు విశాల్. దీన్ని ఆయనే స్వయంగా డైరెక్ట్ చేయనున్నారు.