తమిళ ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు పొన్నంబలం. ఒకప్పుడు తమిళంలో స్టార్ హీరోల పక్కన కూడా విలన్ గా నటించారు. తమిళంతో పాటు తెలుగులోనూ పలు సినిమాల్లో విలన్ గా చేశారు. గతంలో ఆయన తీవ్ర కిడ్నీ సమస్యతో బాధపడేవారు. రెండు కిడ్నీలూ పూర్తిగా పాడైపోవడంతో చాలా కాలం అనారోగ్యానికి గురయ్యారు. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ చేయాల్సి పరిస్థితి వచ్చింది. అప్పటికే తన కుటుంబ ఆర్థిక పరిస్థితి బాలేకపోవడంతో ఇండస్ట్రీలోని ప్రముఖులను సాయం కోరారు. అలా తమిళ ఇండస్ట్రీలో రజనీకాంత్, కమల్ హాసన్, రాధిక శరత్ కుమార్, ధనుష్, కె.ఎస్.రవికుమార్, రాఘవ లారెన్స్ లాంటి తదితర నటులు ఆర్థిక సాయం అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు.
అయితే ఇటీవలే నటుడు పొన్నంబలం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాలేనపుడు ఎంతో మంది తమిళ, తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు సాయం చేశారని అన్నారు. ఈ సందర్భంగా తాను మెగాస్టార్ నుంచి సాయం పొందిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు పొన్నంబలం. తన ఆరోగ్య పరిస్థితి బాలేనపుడు తన స్నేహితుడు ద్వారా మెగా స్టార్ చిరంజీవి ఫోన్ నెంబర్ తీసుకొని ‘‘అన్నయ్య, నాకు బాగోలేదు. మీకు చేతనైనంత సాయం చేయండి’’ అని మెసేజ్ పెట్టానని అన్నారు. తాను మెసేజ్ చేసిన కొద్దిసేపటి తర్వాత చిరంజీవి ఫోన్ చేశారని చెప్పారు. చిరంజీవే తనకు స్వయంగా ఫోన్ చేసి తన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుని ‘‘నేను ఉన్నాను, నేను చూసుకుంటాను. నువ్వు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి వెళ్లు’’ అని చెప్పారని తెలిపారు. తాను ఆసుపత్రికి వెళ్లగానే కనీసం ఎంట్రీ ఫీజ్ కూడా తీసుకోలేదని, తన వైద్యానికి దాదాపు 45 లక్షలు వరకూ ఖర్చు అయిందని, అంతా ఆయన చూసుకున్నారని భావోద్వేగానికి గురవ్వుతూ చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
పొన్నంబలం 1990 ల నుంచి విలన్ గా తమిళ్, తెలుగు సినిమాల్లో నటించారు. తెలుగులో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, మోహన్ బాబు వంటి నటుల సినిమాలలో విలన్ గా చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమాల్లో కనిపించేది కొద్దిసేపే అయినా తనదైన శైలి నటనతో అభిమానులను సంపాదించుకున్నారు. అయితే తన కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ఆయన అనుకోకుండా సినిమాల నుంచి తప్పుకున్నారు. తర్వాత ఆయన్ను అందరూ దాదాపు మర్చిపోయారు. చాలా సంవత్సరాల తర్వాత 2018 లో ‘బిగ్ బాస్ సీజన్ 2’ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరిచారు. తర్వాత మళ్లీ పొన్నంబలం బయట కనిపించలేదు. తాజా ఇంటర్వ్యూలో కనిపించిన ఆయన ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని అన్నారు. ఇప్పుడు కూడా సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉందని, తండ్రి, అన్నయ్య ఇలా ఏ పాత్ర ఇచ్చినా నటించడానికి సిద్దంగా ఉన్నానని, ప్రజలు తనను ఆదరిస్తారనే నమ్మకం ఇప్పటికీ ఉందనీ చెప్పుకొచ్చారు పొన్నంబలం.