టాలీవుడ్ టు బాలీవుడ్, అన్ని చోట్లా ఒకటే ముచ్చట. తమన్నా, విజయ్ వర్మ ప్రేమాయణం పైనే చర్చంతా నడుస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా గోవాలో వీరిద్దరు ముద్దులు పెట్టుకుంటూ కనిపించారంటూ ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. అయితే, ఆ వీడియోలో ఉన్నది వారేనా అనే సందేహాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వచ్చిన తర్వాత.. ఈ జంట ఎక్కడ కలిశారు? వీరి లవ్ స్టోరీ ఎలా మొదలయ్యిందంటూ.. నెటిజన్లు ఆరా తీస్తున్నారు. వీరిద్దరు చాలా రోజులుగా రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నా.. తమన్నా, విజయ్ మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు.   


ఎయిర్ పోర్టులో ఒకరి తర్వాత మరొకరు


తాజాగా తమన్నా, విజయ్ న్యూ ఇయర్ వేడుకలను ముగించుకుని గోవా నుంచి ముంబైకి తిరిగి వచ్చారు. ఎయిర్ పోర్టులో వీరిద్దరు ఒకరి వెనుక మరొకరు వస్తూ కనిపించారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఫోటోలకు ఫోజులిచ్చారు. విజయ్ గ్రాఫిక్ వైట్ టీ-షర్టు, డెనిమ్‌లను ధరించగా, తమన్నా బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతూ కనిపించింది.  


తమన్నా, విజయ్ లవ్ స్టోరీ ఎలా మొదలైంది?


తమన్నా, విజయ్‌ తొలిసారి సుజోయ్ ఘోష్ ‘లస్ట్ స్టోరీస్ 2’ షూట్ లో కలిశారు. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం ఏర్పడిందని తెలిసింది. అదికాస్త ప్రేమగా మారడంతో డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ముంబైలో జరిగిన దిల్జిత్ దోసాంజ్ కచేరీలో ఇద్దరు కలిసి కనిపించడంతో ఆ వార్తలకు మరితం బలం చేకూరింది. ఈ కచేరీలో కార్తిక్ ఆర్యన్, అంగద్ బేడి, నేహా ధూపియా కూడా హాజరయ్యారు. డిసెంబర్ 21న తమన్నా పుట్టినరోజు సందర్భంగా విజయ్.. ఆమె ఇంటికి వెళ్లాడు. బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నాడు. తాజాగా న్యూ ఇయర్ వేడుకలతో గోవా వేదికగా వీరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది.   


నెట్టింట వైరల్ గా మారిన ‘కిస్’ వీడియో


2023 నూతన సంవత్సర వేడుకలను తమన్నా, విజయ్ గోవాలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు ముద్దులు పెట్టుకుంటున్నారంటూ ఓ వీడియో బయటకు వచ్చింది. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. అయితే, అందులో ఉన్నది వారిద్దరా? కాదా అనే సందేహాలు నెలకొన్నాయి. ఎందుకంటే.. ఆ వీడియో అంత స్పష్టంగా లేదు.  


విజయ్ ఎవరు?


హిందీలో 'పింక్' సినిమాతో విజయ్ వర్మ గుర్తింపు తెచ్చుకున్నారు. రణ్‌వీర్‌ సింగ్‌, ఆలియా భట్‌ జంటగా నటించిన 'గల్లీ బాయ్‌'లో ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. గత ఏడాది ఆలియా భట్‌కు జోడీగా నటించిన 'డార్లింగ్స్‌' నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అందులో శాడిస్ట్‌ ప్రేమికుడు, భర్తగా విజయ్‌ వర్మ నటన జనాలను ఆకట్టుకుంది. విజయ్ వర్మ హైదరాబాదీ. అతడు పుట్టింది, పెరిగిందీ ఇక్కడే. మార్వాడీ ఫ్యామిలీ. సినిమాల్లో అవకాశాల కోసం ముంబై వెళ్ళాడు. నాని హీరోగా నటించిన 'మిడిల్ క్లాస్ అబ్బాయి'లో విలన్ రోల్ చేశాడు.   


వరుస సినిమాలతో తమన్నా బిజీ


ప్రస్తుతం తమన్నా మెగాస్టార్ చిరంజీవికి జోడీగా 'భోళా శంకర్' చేస్తున్నది.  అందులో చిరు చెల్లెలుగా కీర్తీ సురేష్ కీలక పాత్ర పోషిస్తోంది.  'సైరా నరసింహా రెడ్డి' తర్వాత చిరు, తమన్నా కలయికలో వస్తున్న చిత్రమిది. హిందీలో 'బోల్ చుడీయా', మలయాళంలో 'బాంద్రా' సినిమాలు చేస్తోంది.  


Read Also: పార్టీలో లిప్ కిస్ ఇస్తూ దొరికేసిన తమన్నా - హైదరాబాదీ నటుడితో డేటింగ్