తమిళంలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సూర్యకు తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన తమిళంలో నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్బై విడుదల అయ్యాయి. ఈ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ‘సింగం’ సిరీస్ సినిమాలను తమిళంలో ఏ రేంజి విజయాలను అందుకున్నాయో, ఇంచుమించు తెలుగులోనూ అదే స్థాయిలో సక్సెస్ అందుకున్నాయి. ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ చిత్రాలు తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఆయన సినిమాలు చూసి ఎంతో మంది తెలుగు ప్రేక్షకులు అభిమానులుగా మారారు. చాలా కాలంగా సూర్య తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయాలని భావిస్తున్నారు. తాజాగా ఆయన తొలి తెలుగు సినిమా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
బోయపాటితో సూర్య మూవీ ఖరారు
ఊరమాస్ టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో సూర్య ఓ సినిమా చేయబోతున్నాడని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లకు వీరి కాంబోలో ఓ మూవీ పట్టాలు ఎక్కబోతున్నట్లు టాక్ నడుస్తోంది. త్వరలోనే వీరి సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ 2024 జనవరి లేదంటే, ఫిబ్రవరిలో మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలకానున్నట్లు సమాచారం. బోయపాటి మార్క్ యాక్షన్ స్టోరీతో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సూర్య పల్లెటూరు వ్యక్తిగా కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది.
‘కంగువ’ షూటింగ్ లో సూర్య
ప్రస్తుతం సూర్య, శివ దర్శకత్వంలో ‘కంగువ’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో సూర్య మొత్తం ఐదు విభిన్న తరహా గెటప్స్ లో కనిపించనున్నారట. సూర్యకి జోడిగా బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని కథానాయికగా నటిస్తోంది. కోవై సరళ, యోగిబాబు, బీ ఎస్ అవినాష్, రెడీన్ కింగ్ స్లే ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా భారీ గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో ఉండబోతోంది. కేవలం 2D ఫార్మేట్ లోనే కాకుండా 3D లో కూడా ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు మేకర్స్. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని తమిళ, తెలుగు, హిందీ సహా మొత్తం పది భాషల్లో ఎంతో గ్రాండ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
‘స్కంద’లో బోయపాటి బిజీ
ప్రస్తుతం బోయపాటి రామ్ పోతినేనితో కలిసి ‘స్కంద’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పాన్-ఇండియన్ లెవల్లో సెప్టెంబర్ 28న విడుదల కానుంది. శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత బాలయ్యతో ‘అఖండ’ సీక్వెల్ చేయాలి అనుకున్నారు. కానీ, బాలకృష్ణ ఏపీ రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఆయన ఎప్పుడు ప్రీ అవుతారో తెలియదు. ఈ నేపథ్యలో సూర్యతో సినిమా చేయాలి అనుకుంటున్నారట బోయపాటి. ఇప్పటికే స్టోరీ నేరేషన్ కూడా అయిపోయినట్లు తెలుస్తోంది.
Read Also: ‘జవాన్’తో పోటీనా? తప్పు చేస్తున్నారని భయపెట్టారు- కానీ, అద్భుతం జరిగింది- నవీన్ పొలిశెట్టి
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial