తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం కమలం పార్టీ పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కోల్పోయిన ఉనికి మళ్లీ సాధించాలన్న కసితో పని చేస్తోంది. డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో వరుస బహిరంగ సభలు నిర్వహించాలని కాషాయ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. పార్టీ అగ్రనేతలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా...తెలంగాణలో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఒకరి తర్వాత ఒకరు పర్యటించేలా రాష్ట్ర నాయకత్వం షెడ్యూల్ ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. బీజేపీ కేడర్ తో పాటు ప్రజల్లో సానుకూలత పెంచేలా బీజేపీ పకడ్బందీ కార్యాచరణను రూపొందిస్తోంది. ప్రచారంలో ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధానంగా ప్రస్తావించనుంది. 


పార్టీలో జోష్ నింపేలా బస్సు చేయాలని రాష్ట్ర నాయకత్వం భావించింది. ఈ నెల 26 నుంచి అక్టోబరు వరకు యాత్ర సాగేలా రూట్ మ్యాప్ ఖరారు చేసుకుంది. అయితే చివరి నిమిషంలో బీజేపీ నాయకత్వం బస్సుయాత్రను రద్దు చేసుకుంది.  యాత్రలకు బదులు అగ్రనేతల బహిరంగ సభలతో, ప్రజలను తమవైపు తిప్పుకోవాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, 17 లోక్‌సభ నియోజకవర్గాలు కవరయ్యేలా బహిరంగసభలకు సిద్ధమవుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌ షా, జేపీ నడ్డాలతో సభల నిర్వహణకు కసరత్తు చేస్తున్నారు. వచ్చే 2, 3 వారాల్లోనే వరుస సభల నిర్వహించేలా షెడ్యూల్ ను ఖరారు చేస్తున్నారు. అక్టోబరు మొదటి వారంలోనే ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాల పరిధిలో కనీసం రెండుచోట్ల రోడ్డు షోలు, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. మిగతా ఉమ్మడి జిల్లాలను కవర్‌ చేసేలా అమిత్‌ షా, నడ్డాల సభలు కూడా ప్లాన్‌ చేశారు.


అక్టోబరు నుంచి బీజేపీ జాతీయ నాయకులు వరుసగా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రధాని మోడీతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. నాయకులతో పాటు కేడర్ కు ఎన్నికలకు సిద్ధం చేయనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వైపల్యాలు, అవినీతి అక్రమాలు, కుటుంబ రాజకీయాలను ప్రధాన అస్త్రాలు వాడనున్నట్లు తెలుస్తోంది. అధికార బీఆర్‌ఎస్, ప్రధాన ప్ర తిపక్ష కాంగ్రెస్‌ తేరుకునే లోగానే అగ్రనేతల విస్తృత పర్యటనలు పూర్తిచేసేలా షెడ్యూల్‌కు రూపకల్పన చేస్తున్నారు.  ప్రచారం ద్వారా ప్రతిపక్షాలకు ఊపిరి సలపకుండా చేయాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అన్ని పార్టీల కంటే రాష్ట్రమంతా ఒక రౌండ్ సభలు నిర్వహించి, ప్రజల్లో సానుకూల పవనాలను రాబట్టాలని చూస్తోంది. 


అక్టోబరులో అసెంబ్లీ ఎన్నికలకు నోటిపికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు...తెలంగాణలో పలుమార్లు పర్యటించారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులపై సమీక్షించారు. డిసెంబరులో ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ముగియనుంది. దీంతో నవంబరు ఎన్నికలు నిర్వహించి...డిసెంబరులో కొత్త ప్రభుత్వం కొలువుదీరేలా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు రెడీ అవుతోంది.