కంప్యూటర్, ఫోన్ స్క్రీన్, టీవీ ఏదో ఒక విధంగా కళ్ళకి ఒత్తిడి పడుతూనే ఉంటుంది. అన్ని వయసుల వాళ్ళు స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇది మన జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయింది. పెరిగిన స్క్రీన్ సమయం ఆరోగ్యాన్ని ముఖ్యంగా కళ్లని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. వాటిలో ఒకటి కంప్యూటర్ విజన్ సిండ్రోమ్(CVS). దీన్నే డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని కూడా పిలుస్తారు. దీర్ఘకాలం పాటు కంప్యూటర్, ట్యాబ్, మొబైల్ ఫోన్ వాడకం ఎక్కువగా చూడటం వల్ల కలిగే కంటి సమస్య. ఎక్కువ సేపు డిజిటల్ స్క్రీన్ చూస్తున్నప్పుడు చాలా మందికి కంటి చికాకు, దృష్టి లోపం సమస్యలు వస్తాయి. ఇది సాధారణ పనుల తీరుని ప్రభావితం చేస్తుంది.


CVS లక్షణాలు


⦿కళ్ళు అలిసిపోయిన భావన


⦿తలనొప్పి


⦿మసక మసకగా కనిపించడం


⦿పొడి బారిపోవడం


⦿కళ్ళు మంటలు


⦿కంటి దురద, ఎర్రగా మారడం


⦿మెడ, భుజం నొప్పి


తక్కువ రిజల్యూషన్ లేదా పిక్సలేటెడ్ డిస్ ప్లే కాంట్రాస్ట్ వల్ల కంటి మీద ఒత్తిడి ఏర్పడుతుంది. దీని వల్ల స్క్రీన్ మీద కనిపించే అక్షరాలు అంతగా కనిపించవు. పదాలు చూస్తున్నప్పుడు కళ్ళు ఒత్తిడికి గురవుతాయి. నిరంతరం స్క్రీన్ మీద దృష్టి కేంద్రీకరిస్తారు. కళ్ల ముందు కనిపించే దృశ్యాలు మారుతున్నప్పుడు మెదడు వేగంగా పని చేసేందుకు కళ్ళు ప్రతిస్పందిస్తాయి. ఇవి కంటి కండరాల మీద తీవ్ర ఒత్తిడి కలిగిస్తాయి.


కొంతమంది స్క్రీన్ చూసేటప్పుడు తక్కువగా రెప్పలు వేస్తారు. ప్రజలు సాధారణంగా నిమిషానికి 12-15 సార్లు రెప్పపాటు చేస్తారు. కానీ కంప్యూటర్ వినియోగిస్తున్నప్పుడు నిమిషానికి మూడు నుంచి ఏడు సార్లు మాత్రమే రెప్ప వేస్తారు. స్క్రీన్ వాడకం వల్ల అది కూడా అసంపూర్తిగా ఉంటుంది. అంటే కళ్ళు పాక్షికంగా మాత్రమే మూసుకుంటారు. అలా చేసినప్పుడు కళ్ళు త్వరగా పొడిబారడం జరుగుతుంది.


కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ (CVS) చికిత్స


⦿20-20-20 నియమాన్ని అనుసరించడం వల్ల ఈ సమస్య నుంచి త్వరగా బయట పడొచ్చు. స్క్రీన్ ఎక్కువ సేపు చూస్తూ ఉండటం వల్ల కళ్ల మీద విపరీతమైన ఒత్తిడి పడుతుంది. దాన్ని అధిగమించేందుకు ఈ నియమం సహాయపడుతుంది. ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుని 20 సెకన్ల పాటు చూడాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల కంటి ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.


⦿అలాగే కళ్లని తేమగా ఉంచుతుంది. తరచుగా రెప్ప వేయడం వల్ల కళ్ళు పొడిబారిపోకుండా చికాకు పెట్టకుండా ఉంటాయి.


⦿కంప్యూటర్ స్క్రీన్ కళ్ళకి 20 లేదా 28 అంగుళాల దూరంలో ఉండేలా సెట్ చేసుకోవాలి. డిజిటల్ స్క్రీన్ కి దగ్గరగా కూర్చోవడం వల్ల కళ్ళు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు పేరుగతాయి.


⦿యాంటీ గ్లర్ స్క్రీన్ ఉపయోగించడం మంచిది.


⦿కళ్ళు తేమగా ఉంచుకునేందుకు వైద్యుల సలహా ప్రకారం ఐ డ్రాప్స్ వినియోగించుకోవచ్చు. అవసరాన్ని బట్టి రోజుకి 3-4 సార్లు ఐ డ్రాప్స్ వేసుకోవచ్చు.


 గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: పండ్లు కుళ్లిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి!