మిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ ఆంధ్రప్రదేశ్‌లోని పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నారు. తాజాగా ఆయన కుటుంబ సమేతంగా కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు రజనీ. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను రజనీ కాంత్ కుటుంబానికి అందజేశారు. రజనీ కాంత్ తిరుపతి వచ్చిన సమయంలో ఆయన్ను చూడటానికి ఆలయం బయట భారీ స్థాయిలో భక్తులు చేరుకున్నారు. రజనీ కాంత్ వెంట ఆయన కూమార్తె ఐశ్వర్య కూడా ఉన్నారు.


రజనీ కాంత్ తిరుపతి నుంచి నేరుగా కడప చేరుకున్నారు. అక్కడ ప్రఖ్యాతగాంచిన అమీన్ పీర్ దర్గా ను సందర్శించారు. ఈ సందర్భంగా దర్గా పీఠాధిపతిని కలిశారు రజనీ కాంత్. ఈ క్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ కూడా కుటుంబ సమేతంగా కడప పెద్ద దర్గా కు చేరుకున్నారు. అనంతరం రజనీ కాంత్ ఆయన కుమార్తె ఐశ్యర్య, రెహమాన్, ఆయన కుమారుడు అమీన్ పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పెద్ద దర్గా విశిష్టతను రజనీకాంత్, రెహమాన్ కు వివరించారు మత పెద్దలు. సాంప్రదాయం ప్రకారం రెహమాన్ కు రజనీ తలపాగ చుట్టారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రార్థనలు చేసుకునే విధంగా అవకాశం కల్పించారు దర్గా ప్రతినిధులు. దాదాపు రెండు గంటల పాటు రెహమాన్ దర్గాలో గడిపారు. రజనీకాంత్, రెహమాన్ కలసి రావడంతో వారిని చూసేందుకు స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.  


డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజనీ కాంత్ తన 72వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. అయితే ఆయన ఆ రోజున చెన్నై లో లేరు. కానీ బుధవారం సాయంత్రానికి తిరుపతికి చేరుకొని.. గురువారం వేకువ జామునే శ్రీవారిని దర్శించుకున్నారు రజనీ. అనంతరం కడప దర్గాను కూడా సందర్శించారు. కాగా, రజనీ కాంత్ కూతురు ఐశ్వ‌ర్య ద‌ర్శ‌క‌త్వంలో ఆయన తొలిసారి ఓ సినిమా చేయ‌బోతున్నారు. అదే ‘లాల్ సలాం’.  అయితే ఈ సినిమాలో రజనీ కాంత్ హీరో కాదు. ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా పోస్టర్ ను ఇటీవలే విడుదల చేశారు. ఈ మూవీ లో యంగ్ హీరో విష్ణు విశాల్, విక్రాంత్  హీరోలుగా కనిపించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభంకానుంది. ఈ మూవీను లైకా ప్రొడ‌క్ష‌న్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఏ.ఆర్.రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు.


ఈ సినిమాతో ఐశ్వర్య దాదాపు ఐదేళ్ల తర్వాత దర్శకత్వం వహించనుంది. ఐశ్వర్య గతంలో ధనుష్ హీరోగా ‘3’ సినిమా తీసింది. తర్వాత ‘వాయ్ రాజా వాయ్’, 2017లో ‘వీరన్’ సినిమాలు చేసింది. ఇప్పుడు ‘లాల్ సలాం’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీ కాంత్ కూడా ఈ సినిమాలో  చేయడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. రజనీకాంత్ కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రజనీ ‘జైలర్’ సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ మూవీ నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది.