సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమా ‘జైలర్’. ‘కోకో కోకిల’, ‘డాక్టర్’,  ‘ బీస్ట్’ చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు నటుడు సునీల్ కూడా ఇప్పుడు ‘జైలర్’ నటిస్తున్నారు. నేటి నుంచి ఆయన పోర్షన్ ప్రారంభం అయింది. ఈ విషయాన్ని చిత్రబృందం పోస్టర్ ద్వారా వెల్లడించింది.


దక్షిణ భారతదేశంలోని అన్ని పరిశ్రమల నుంచి టాప్ స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. కన్నడ హీరో శివరాజ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాలో కనిపించనున్నారు. వీరితో పాటు రమ్యకృష్ణ, వసంత్ రవి, వినాయకన్, యోగి బాబు కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఇప్పుడు వీరితో సునీల్ కూడా జాయిన్ అయ్యారు. పోస్టర్‌ను బట్టి చూస్తే సునీల్ ఇందులో సీరియస్ పాత్రలో కనిపించనున్నాడని చెప్పవచ్చు.


ఈ సినిమా ఫస్ట్‌లుక్ వీడియోను సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. జైలు బ్యాక్‌డ్రాప్‌లో జరగనున్న ఈ సినిమాలో రజినీకాంత్ ‘జైలర్’ పాత్రలో కనిపించనున్నారు. ఒక సెంట్రల్ జైలు నేపథ్యంలో 24 గంటల వ్యవధిలో జరిగే కథ ఇది అని పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.


సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమిళ నూతన సంవత్సరం సందర్భంగా 2023 ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనుకున్న తేదీకి విడుదల అవుతుందో చూడాల్సి ఉంది.


'జైలర్' సినిమాలో రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ కథానాయికగా నటిస్తున్నారు. గతంలో వీళ్లిద్దరి కలయికలో చాలా హిట్ సినిమాలు వచ్చాయి. వీటిలో 'నరసింహ' ఎవర్ గ్రీన్ ఫిల్మ్. ఆ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ చేసిన రోల్ నటిగా ఆమెకు మంచి గుర్తింపు తీసుకు వచ్చింది. ఇప్పటికీ రమ్యకృష్ణ బెస్ట్ రోల్స్ అంటే నీలాంబరి పాత్ర పేరే చాలా మంది చెప్తారు. చాలా సంవత్సరాల విరామం తర్వాత రజనీతో రమ్యకృష్ణ సినిమా చేస్తున్నారు.