Sundeep Kishan New Movie: సంక్రాంతి సందర్భంగా సందీప్ కిషన్ కొత్త సినిమా పోస్టర్ విడుదల అయింది. తమిళ దర్శకుడు శామ్ ఆంటోన్ దర్శకత్వంలో ‘బడ్డీ’ అనే సినిమాకు సందీప్ కమిటయ్యాడు. ఈ సినిమా పోస్టర్ చూడటానికి ఆర్య గతంలో నటించిన ‘టెడ్డీ’ తరహాలో ఉంది. చేతిలో గన్‌తో, పక్కనే టెడ్డీ బేర్‌తో ఉన్న సందీప్ కిషన్‌ను ఈ పోస్టర్‌లో చూడవచ్చు.


అయితే ఈ సినిమా ‘టెడ్డీ’ రీమేక్ కాదని, పూర్తిగా కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కనుందని సందీప్ కిషన్ తెలిపారు. కానీ ఈ కథ పూర్తిగా ‘టెడ్డీ వరల్డ్’లోనే జరుగుతుందని తెలిపాడు. దీన్ని బట్టి సౌత్ ఇండియాలో ఇది కొత్త సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పవచ్చు.


ఇక ‘టెడ్డీ’ విషయానికి వస్తే... ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్. కోమాలో ఉన్న అమ్మాయి ఆత్మ తాను బతికుండగానే టెడ్డీ బేర్‌లో ప్రవేశించి హీరో ద్వారా తన ప్రాణాలు కాపాడుకుంటుంది. హీరో పాత్రలో ఆర్య, కోమాలో ఉన్న అమ్మాయి పాత్రలో సయేషా సైగల్ నటించారు. ఇప్పుడు ‘బడ్డీ’లో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నాడు.


నిజానికి ఈ సినిమాను హడావుడిగా ప్రకటించాల్సి వచ్చింది. 2023లో నెట్‌ఫ్లిక్స్‌లో రానున్న తెలుగు సినిమాలను నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. అందులో భాగంగా ఈ సినిమాను కూడా లిస్ట్ చేసింది. దీంతో సందీప్ కిషన్ కూడా ట్వీట్ చేశాడు. విషయం బయటకు వచ్చేసింది కాబట్టి అధికారికంగా ప్రకటిస్తున్నామని ట్వీట్ చేశాడు.


‘మైకేల్’, ‘ఊరు పేరు భైరవ కోన’ సినిమాల తర్వాత ఈ సినిమాలో నటించనున్నట్లు సందీప్ కిషన్ తెలిపాడు. ‘మైకేల్’ సినిమాను ఫిబ్రవరి 3వ తేదీన విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఇది విడుదల కానుంది. తర్వాతి సినిమా ‘ఊరు పేరు భైరవ కోన’కు విభిన్న చిత్రాల దర్శకుడు వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే అని తెలుస్తోంది.


‘బడ్డీ’ సినిమాను కూడా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు లేటెస్ట్ సెన్సేషన్ హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. ‘బడ్డీ’ ఎప్పుడు విడుదల కానుందో తెలియరాలేదు. ‘మైకేల్’ విడుదల తర్వాత దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.