సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో పూజాహెగ్డే హీరోయిన్ గా తీసుకున్నారు. రీసెంట్ గా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ సినిమా నిర్మిస్తోంది. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమా (SSMB 28 Movie) ఇది. ఈ సినిమాలో సరికొత్త లుక్ తో కనిపించబోతున్నారు మహేష్ బాబు. చాలా ఏళ్ల తరువాత త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో మంచి బజ్ క్రియేట్ అవుతోంది. 
 
రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ని మొదలుపెట్టబోతున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమాకు పూర్తి కథ లేదట. స్టోరీ రెడీగా లేదు కాబట్టే దర్శకుడు త్రివిక్రమ్ ముందుగా ఒక యాక్షన్ ఎపిసోడ్ తో సినిమాను మొదలుపెట్టాడని అంటున్నారు. నెక్స్ట్ షెడ్యూల్ మొదలుపెట్టాలనుకునే సమయంలో మహేష్ బాబు తల్లి మరణించారు. 


పదకొండు రోజులు కర్మకాండలు అయ్యాక.. ఒక యాడ్ కోసం మహేష్ బాబు పని చేశారు. ఆ తరువాత షూటింగ్ మొదలుపెడతారానుకుంటే.. యాడ్ చేసి విదేశాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియదని అంటున్నారు. ఈలోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తారని అంటున్నారు. మరికొందరేమో.. త్రివిక్రమ్.. మహేష్ బాబుకి సగం కథే చెప్పారని.. సెకండ్ హాఫ్ రెడీగా లేదని చెబుతున్నారు. ఏమైనా కూడా కథ పూర్తి గా లేదనేది ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరి దీనిపై చిత్రబృందం రియాక్ట్ అవుతుందేమో చూడాలి!


మహేష్ సినిమాలో ఐటెం సాంగ్:
తొలిసారి మహేష్ బాబు కోసం త్రివిక్రమ్ ఐటెం సాంగ్ పెట్టబోతున్నారట. ఈ విషయంపై నిర్మాత నాగవంశీ కూడా స్పందించారు. సినిమాలో ఐటెం సాంగ్ పెట్టాలని అనుకున్న మాట నిజమేనని.. కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మహేష్ బాబు గారి ఫ్యాన్స్, మాస్ ప్రేక్షకుల కోసం ఐటెం సాంగ్ పెడితే బాగుంటుందని.. త్రివిక్రమ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు నాగవంశీ. ఆయన ఇంకా ఈ విషయంపై డెసిషన్ తీసుకోలేదని చెప్పారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అతడు', 'ఖలేజా' రెండూ థియేటర్లో అనుకున్నంత స్థాయిలో ఆడలేకపోయాయని.. కానీ టీవీలో బిగ్గెస్ట్ వ్యూస్ అందుకున్నాయని చెప్పారు. 
 
ఈసారి ఈ కాంబో మీద ఎన్ని అంచనాలు పెట్టుకున్నా.. వాటిని మించి సినిమా ఉంటుందని నమ్మకం వ్యక్తం చేశారు నాగవంశీ. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఐటెం సాంగ్ ఉండదు కానీ స్పెషల్ పబ్ సాంగ్స్ లాంటివి ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు కోసం తన పంథా మార్చుకొని ఐటెం సాంగ్ పెడతారో లేదో చూడాలి!


#SSMB28Aarambham:
ఇదిలా ఉండగా.. ఈ సినిమా షూటింగ్ మొదలవ్వక ముందు, షూటింగ్ మొదలైన తరువాత.. సినిమాకి టైటిల్ ఇదేనంటూ చాలా రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. షూటింగ్ మొదలుపెట్టిన రోజు #SSMB28Aarambham అంటూ మేకర్స్ ఒక హ్యాష్ ట్యాగ్ వదలడంతో.. ఈ సినిమాకి టైటిల్ హింట్ ఇచ్చేశారని అందరూ భావించారు. 'ఆరంభం'(Aarambham) అనేది  సినిమా టైటిల్ అని.. అందుకే అలా ట్యాగ్ చేశారంటూ ఆ టైటిల్ ను ట్రెండ్ చేశారు.
 
'అయోధ్యలో అర్జునుడు':
మేకర్స్ మాత్రం ఈ టైటిల్ పై క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు మరో టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటు త్రివిక్రమ్, ఇటు మహేష్ బాబు ఇద్దరి సెంటిమెంట్ కలగలిసేలా 'అయోధ్యలో అర్జునుడు' అనే టైటిల్ పెట్టబోతున్నారని టాక్. ఇదే టైటిల్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదివరకు త్రివిక్రమ్ సినిమాల టైటిల్ విషయంలో ఏం జరిగేదో అందరికీ తెలిసిందే. ఒక టైటిల్ ను వారే క్రియేట్ చేసి జనాల్లోకి వదిలేవారు. ఆ టైటిల్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి టైటిల్ మార్చడమా..? ఫైనల్ చేయడమా..? అనే విషయంలో నిర్ణయం తీసుకునేవారు. మరిప్పుడు 'అయోధ్యలో అర్జునుడు' టైటిల్ ను ఫైనల్ చేస్తారో లేదో చూడాలి! 


Read Also: పెళ్లికూతురుగా కీర్తి సురేష్‌ - బర్త్‌డే గిఫ్ట్ అదుర్స్, బరాత్‌లో మహానటి రచ్చ!