కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించి తెరకెక్కించిన ‘కాంతార’ సినిమా దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమాను ముందు కేవలం కన్నడలో మాత్రమే విడుదల చేశారు. అక్కడ సినిమా భారీ సక్సెస్ రావడంతో ఇతర భాషల్లోనూ విడుదల చేశారు మేకర్స్. విడుదల అయిన అన్ని చోట్లా సినిమా భారీ హిట్ ను అందుకుంది. రూ.16 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి చరిత్ర సృష్టించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే తాజాగా ‘కాంతార’ సినిమాపై దర్శక ధీరుడు రాజమౌళి స్పందించారు.
ఇటీవల ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన ‘కాంతార’ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. చిన్న సినిమాలు కూడా భారీ కలెక్షన్స్ సాధిస్తాయని ఈ సినిమా నిరూపించిందన్నారు. భారీ బడ్జెట్ సినిమాలు ప్రత్యేకమే. కానీ ‘కాంతార’ లాంటి చిన్న సినిమా కలెక్షన్స్ లో మ్యాజిక్ చేసిందని పేర్కొన్నారు. సినిమా మేకింగ్ భారీగా ఉండాలి అనుకునే తన లాంటి వాళ్ళని ఈ సినిమా ఇరకాటంలో పెట్టిందన్నారు. భారీ బడ్జెట్ సినిమాలు తీసే దర్శకులని ఈ చిత్రం ఆలోచనలో పడేసిందని వ్యాఖ్యానించారు. సినిమా నిర్మాణ వ్యయాన్ని మరోసారి సమీక్షించుకునేలా చేసిందని అన్నారు. ఇక నుంచి తాము సినిమా మొదలుపెట్టేటప్పుడు బడ్జెట్ ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని తెలిపారు. ఫిల్మ్ మేకర్స్ గా మనం ఏం చేస్తున్నామనే విషయాన్ని ఓసారి పునరాలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు రాజమౌళి.
ఇక ‘కాంతార’ సినిమా కర్ణాటకలో 168.50 కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది. బాలీవుడ్ లో కూడా రూ.96 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అలాగే తెలుగు రాష్ట్రాలలో రూ.60 కోట్లు, తమిళనాడు లో 12.70 కోట్లు, కేరళలో 19.20 కోట్లు సాధించింది. అంతేకాకుండా ఓవర్ సీస్ లో ఈ సినిమాకు 44.50 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇది మొత్తంగా చూస్తే 400 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించి రికార్డులు సృష్టించిందీ మూవీ. ఈ సినిమా హిందీ వెర్షన్ అనేక బాలీవుడ్ సినిమాలకు కొన్ని వారాల పాటు పోటీ ఇవ్వడం గమనార్హం. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్, చలువే గౌడ నిర్మించిన ఈ సినిమాలో రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, కిషోర్ కుమార్ కీలక పాత్రలలో కనిపించారు.
ఇక రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గత వారం మొదటి అంతర్జాతీయ అవార్డును అందుకుంది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్‌లో రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా అవార్డును అందుకోవడంతో ఈ మూవీ మొదటి అంతర్జాతీయ అవార్డును పొందింది. అమెరికాలో అతి పురాతనమైన ఈ సంస్థ నుంచి అవార్డు పొందడంతో ‘ఆర్ఆర్ఆర్’ కు మరో అరుదైన గౌరవం లభించిందనే చెప్పాలి. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ బ్రిటషర్లకు వ్యతిరేకంగా చేసిన పోరాట సన్నివేశాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ ప్రత్యేక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 1200 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది.