'గబ్బర్ సింగ్'తో బ్లాక్ బస్టర్ అందుకున్న పవన్ కల్యాణ్, హరీష్ శంకర్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా ఆదివారం (డిసెంబరు 11న) లాంఛనంగా ప్రారంభమయ్యింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆదివారం ఉదయం 11.45 గంటలకు పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాతలు, పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు వి.వి.వినాయక్, కె.దశరథ్, మలినేని గోపీచంద్, బుచ్చిబాబు, నిర్మాతలు ఎ.ఎం. రత్నం, దిల్ రాజు, శిరీష్, విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల, సాహు గారపాటి, రామ్ ఆచంట, గోపి ఆచంట, కిలారు సతీష్ హాజరయ్యారు. దిల్ రాజు క్లాప్ కొట్టగా, ఎ.ఎం.రత్నం కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ముహూర్తపు షాట్ కి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు. రామ్ ఆచంట, విశ్వప్రసాద్, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు తమ చేతుల మీదుగా స్క్రిప్ట్ ని అందించారు. 'ఉస్తాద్ భగత్ సింగ్‌'ను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై రవిశంకర్, నవీన్ యెర్నేని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.  


ఈ సినిమాకు అయానంక బోస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయనున్నారు. రామ్-లక్ష్మణ్ ద్వయం ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేయనున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. పవన్-హరీష్ కలయికలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతోనూ విజయపరంపరను కొనసాగించడానికి మైత్రి సంస్థ సిద్ధం అవుతోంది.






స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన పవన్ అలీవ్ గ్రీన్ షర్ట్


ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్‘. ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తం ఈవెంట్ లో పవన్ కల్యాణ్ వేసుకున్న షర్ట్ స్పెషల్ గా నిలిచింది. అలీవ్ గ్రీన్ చొక్కా వేసుకుని ఆయన ఈ వేడుకలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. ఆయన ఈ షర్ట్ వేసుకుని వైసీపీకి గట్టి కౌంటర్ ఇచ్చినట్టుగా పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత కొంత కాలంగా ఏపీలో ‘వారాహి’ వాహన రంగులపై వివాదం నెలకొంది. ఎన్నికల ప్రచారం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వాహనాన్ని తయారు చేయించారు. అయితే, వారాహి వాహనంపై వైఎస్ఆర్‌సీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఆ పార్టీ నేతలు అంబటి రాంబాబు, రోజా, పేర్ని నాని సహా పలువురు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.


ఆ రంగుపై ఎందుకు వివాదం?


మిలటరీ వాహనాలకు మాత్రమే వినియోగించే ఆలీవ్ గ్రీన్ కలర్‌ను ‘వారాహి’కి వేశారని, అది నిషేధిక రంగు అంటూ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. త్వరలోనే టీడీపీలో జనసేన కలిసిపోతుందని, అందుకు ముందస్తుగా ఆ వాహనం కలర్ పసుపు వేయించుకోవాలని పేర్ని నాని సూచించారు. పేర్ని నాని వ్యాఖ్యలకు జనసేన నేత నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసి హైకోర్టులతో మొట్టికాయలు తిన్నారంటూ విమర్శించారు. కనీస అవగాహన లేకుండా కొందరు మైకుల ముందు కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుతుంటారన్నారు. అన్ని విషయాలను పరిశీలించాకే జనసేన ముందుకు వెళ్తుందని, వారాహి రంగు విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అభ్యంతరం ఉంటే రవాణాశాఖ ఎందుకు పర్మిషన్ ఇచ్చిందని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. 


వైసీపికి గట్టి కౌంటర్ ఇచ్చిన పవన్ కల్యాణ్


వారాహి రంగుపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు పవన్  కౌంటర్ ఇచ్చారు. మొదట తన సినిమాలు ఆపారని.. తర్వాత తను విశాఖ పర్యటకు వస్తే హోటల్ రూమ్‌ నుంచి బయటకు వెళ్లనియ్యలేదని ఇప్పుడు ఊపిరి తీసుకోవడం కూడా ఆపేయాలా అంటూ ఎద్దేవా చేశారు.  ఆయన కౌంటర్ కు అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు. “శ్వాస తీసుకో, ప్యాకేజీ తీసుకోకు” అంటూ ట్వీట్ చేశారు. అటు అలీవ్ గ్రీన్ కలర్ షర్ట్‌ ను పోస్ట్ చేసి.. కనీసం తాను ఈ చొక్కానైనా వేసుకోనిస్తారా?’’ అని ప్రశ్నించారు.  ఆ తర్వాత  పవన్ కల్యాణ్‌కు మాత్రమే రూల్స్ అమలు చేస్తారా? అని అలీవ్ గ్రీన్ కలర్‌లో ఉన్న కొన్ని వాహనాల ఫోటోలను పోస్ట్ చేశారు. ఈర్ష్యతో వైసీపీ రోజు రోజుకు కుంచించుకుపోతోందని మరో ట్వీట్ చేశారు. టిక్కెట్ రేట్లు.. రంగులు వంటి వాటి మీద కాదని..అభివృద్ధి పై దృష్టి సారించాలని సూచించారు. పవన్ కల్యాణ్..  వైఎస్ఆర్‌సీపీ తన విషయంలో అన్నింటినీ వివాదాస్పదం చేయడాన్ని తీవ్రంగా తీసుకున్నారు.