యంగ్ హీరో కిరణ్ అబ్బవరం చాలా తక్కువ కాలంలోనే తెలుగు రాష్ట్రాలలో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ మదనపల్లె కుర్రాడు.. ఆ తర్వాత ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్నాడు. స్వతహాగా స్ట్రిప్ట్ రైటర్ అయిన కిరణ్.. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి కమర్షియల్ అంశాలతో కూడిన ప్రయోగాత్మక చిత్రాలు చేస్తున్నాడు. తన సినిమాలో ఏదో ఒక విషయం ఉంటుందన్న పేరు సంపాదించుకున్నాడు ఈ హీరో. గతంలోని కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలను సాధించలేకపోయాయి. దీంతో ఆయన అభిమానులు కాస్త ఆందోళన చెందారనే చెప్పాలి. ఈ క్రమంలో ఇప్పుడు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కాంపౌండ్ లోకి అడుగుపెట్టాడు ఈ హీరో. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యాడు. ప్రస్తుతం ఇప్పుడు ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు హీరో. అయితే గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అంతే కాదు టీజర్, ట్రైలర్, వాసవ సుహాస పాటకి విశేష స్పందన లభించడం గమనార్హం.
ఆదివారం తిరుపతిలో ఆడియో వేడుకను గ్రాండ్ గా ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ చిత్ర కథ తిరుపతిలోనే జరగడంతో అక్కడే ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఇక చిత్ర యూనిట్ ‘‘సోల్ ఆఫ్ తిరుపతి’’ అంటూ సాగే నాల్గవ పాటను కూడా ఆవిష్కరించింది. ఈ పాటను శ్రీవిష్ణువుకు భక్తుడైన తాళ్లపాక అన్నమాచార్య 12వ తరం కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ప్రారంభించడం విశేషం. అనంతరం వారిని ఘనంగా సత్కరించారు. చైతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్‌కి కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని సాహిత్యం అందించారు. ఇందులో తిరుపతి వేంకటేశ్వరుని గొప్పతనాన్ని వర్ణించిన తీరు అద్భుతం. ఇక అనురాగ్ కులకర్ణి గానం శ్రోతలను తప్పకుండా ఆకట్టుకుంటుంది. ఈ పాటలో భావోద్వేగం, ఆలోచింపజేసే సాహిత్యం రెండూ ఉన్నాయి.
ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా 18న విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చిత్ర యూనిట్ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తిరుపతిలోనే ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఈ సినిమా ప్రమోషన్ వర్క్ మొదలు చేసినప్పటి నుంచి అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. అంతే కాదు కళాతపస్వి కె. విశ్వనాథ్ గారిచే ‘‘వాసన సుహాస’’ పాటను లాంచ్ చేయడంతో మరింత క్రేజ్ పెరిగింది.
ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ సభ్యుల మన్ననలు పొందింది. U/A సర్టిఫెకెట్ ను సాధించుకుంది. ఈ మూవీతో మురళీ కిషోర్ అబ్బూరు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను, GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఫ్యామిలీ అంత కలిసి వెళ్లే విధంగా నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకోగలుగుతుందో చూడాలి.
Read Also: ‘సీతారామం’ బ్యూటీపై దారుణమైన ట్రోలింగ్స్, నేనూ మనిషినే అంటూ ఆవేదన!