డిసెంబర్ మొదటి వారంలో ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో స్కైలాబ్ ఒకటి. కథనం కొంచెం స్లోగా ఉందని మిశ్రమ స్పందన వచ్చినా.. వినూత్నమైన ప్రయత్నం అని అందరూ అభినందించారు. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ కానుంది. జనవరి 14వ తేదీ నుంచి సోనీ లివ్‌లో ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. ఈ సినిమాలో నిత్య మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రలు పోషించారు.
నిత్య మీనన్ ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించింది. 1979లో జరిగిన స్కైల్యాబ్ ఉదంతం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. స్కైలాబ్ అమెరికా ఏర్పాటుచేసిన మొట్టమొదటి అంతరిక్ష కేంద్రం. దీన్ని 1973 మే 14వ తేదీన ప్రారంభించారు. దాని బరువు 2,310 కిలోలుగా ఉండేది. అప్పట్లో అది భూమి వాతావరణం గురించి బోలెడంత డేటాను సేకరించి శాస్త్రవేత్తలకు అందించింది. సూర్యుడిపై కూడా ఎంతో లోతైన అధ్యయనాలను నిర్వహించింది. కానీ కాలం చెల్లడంతో గతి తప్పి మిపై కూలేందుకు సిద్ధమైంది. కానీ, భూమిపై ఎక్కడ పడుతుందనే విషయాన్ని నాసా స్పష్టంగా తెలియజేయలేదు. దీంతో ప్రజల్లో భయాందోళనలు ఎక్కువ అయ్యాయి.
మొదట స్కైలాబ్ సముద్రంలో కూలిపోతుందని భావించారు. కానీ ఆ తర్వాత అది భూమి వైపుకు దూసుకొస్తుందని, స్కైలాబ్ పడిన చోట భారీ విధ్వంసం తప్పదనే ప్రచారం విస్తృతంగా జరిగింది. రేడియోల్లో ఎప్పుడూ చూసినా ఇవే వార్తలు వినిపించేవి. కొందరు తమకు తెలిసిన సమాచారానికి.. భయాన్ని జోడించి ప్రచారం చేస్తూ ఆందోళన రెట్టింపు చేశారు. దీంతో ప్రపంచంలో చాలామంది ఆఖరి క్షణాలని భయపడ్డారు. తెలంగాణలోని నిజామాబాద్ నుంచి ఏపీలోని తీర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఈ ‘స్కైలాబ్’ కూలే ప్రమాదం ఉందంటూ ఓ పత్రికలో వచ్చిన కథనం ప్రజలను మరింత భయపెట్టింది.