అమ్మ..ఈ జగత్తులో విలువ కట్టలేని పదం. తన బిడ్డలపై ప్రేమ కురిపించటం, కంటికి రెప్పలా పొదుముకోవటం తప్ప మరో విషయమే తెలియని అమాయకత్వం. తనకు కష్టాలుండవు..ఉన్నా పైకి చెప్పుకోదు. కానీ తన బుజ్జాయి తనువు పై చిన్నగీతపడినా తల్లడిల్లిపోతుంది ఆ ప్రాణం. తన ఒడి నుంచి బిడ్డ దూరం వెళ్తుంటే చాలు ఏదో తెలియని కన్నీటి సుడులు తిప్పుకుంటుంది ఆ మనసు. నిష్కల్మషమైన ఆ ప్రేమను ఎలా కొలవాలి. దానికసలు ప్రమాణాలు ఉంటాయా. మరెలా ఆ ప్రేమను వ్యక్త పరచటం. అందుకే సీతారాముడు కూడా చిన్నపిల్లాడిలానే రాశాడీ పాట.
జీవితంలో వేల పాటలు రాసిన మహాకవికి...తనకే తెలుసో తెలియని తన చివరిరోజుల్లో...అమ్మ గురించి రాయవయ్యా అన్నారు అనుకుంటా. అమ్మ గురించా...ఆహా ఎంత అదృష్టం అని మొదలు పెట్టి ఉంటాడు. అందుకే పల్లవిలోనే......
"అమ్మా...వినమ్మా..
నేనాటి నీ లాలి పదాన్నే..
ఓ..... అవునమ్మా..
నేనేనమ్మా....
నువ్వు ఏనాడో కని పెంచిన స్వరాన్నే...
మౌనమై ఇన్నాళ్లూ....నిదురలోనే ఉన్నా..
గానమై ఈనాడే..మేలుకొన్నా.."
మనం ఎప్పుడూ అమ్మతో మాట్లాడం. బాగున్నావా అని అడగం. ఎందుకంటే అమ్మతో మనది నిగూఢమైన బంధం. పేగు బంధం, రక్త సంబంధం. తనే నువ్వు...నువ్వే తను అయినప్పుడు..నిన్ను నువ్వే అడుగుతావా రోజూ బాగున్నావా అని. అమ్మపై నిర్లక్ష్యంతో కూడిన అధికారం మనది. మరి అమ్మపై నిజంగా మన ప్రేమను వ్యక్తపరిచే సందర్భమే వస్తే....ఇలానే మొదలుపెట్టాలేమో. నిజం..మనందరి జీవితాల్లో మనం విన్న మొదటి పదం అమ్మ లాలి పాటే అయ్యుంటుంది. నీకేం కష్టం వచ్చిందో చెప్పుకోలేని స్థితిలో...ఉయ్యాలలో ఊగుతూ గుక్కపడితే చాలు...జో లాలి అంటూ అమ్మ పాడే పాటను మించిన పదాలను..రాగాలను మనం జీవితంలో వింటామా అసలు..ఏమో. తన జీవిత అనుభవమే మనకు తొలి పాఠంలా నేర్పిస్తుంది అమ్మ. జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్పి ధైర్యాన్ని ఇస్తుంది. తను కనిపెంచిన స్వరం మనం. మౌనమై ఇన్నాళ్లూ దాక్కున్నా...చెప్పాల్సిన సందర్భం రాక నిదురలోనే ఉన్న మన ప్రేమ...ఓ అద్భుతమైన గానమై ఈ నాడే మేల్కొంటే...అద్భుతం కదా ఆ సందర్భం.
"నీ పాదాలకు మువ్వల్లా..
నా అడుగులు సాగాలమ్మా...
నీ పెదవుల చిరునవ్వుల్లా...
నా ఊపిరి వెలగాలమ్మా....
నిరంతరం నీ చంటి పాపల్లే...
ఉండాలి నేనెళ్ళాలకీ...
నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే........!!!!"
మన జీవితం ధ్వని ప్రధానం. మిగిలిన ఎన్నో వేల కోట్లు జీవులు వినలేని ధ్వనులను మనం ఆస్వాదిస్తాం. కానీ మన జీవితంలో మొదటిసారి వినే ధ్వని అమ్మే. తన లాలిపాట..తన జోలపాట...తన అడుగుల శబ్దం..ఆ మువ్వల సవ్వడి...పసిప్రాణాలకు హాయిని ఇచ్చేది అవే. ఏమైంది బంగారం...ఎందుకేడుస్తున్నావ్ అంటూ మనల్ని ప్రేమతో ఊరడించి....మనం ఏడుపు ఆపి నవ్వుతుంటే...తనూ నవ్వుతుంది చూడు. ఆ పెదవులపై చిరునవ్వులే మన ఊపిరిని వెలిగిస్తాయి. ఆ క్షణాలు..జ్ఞానం వికసించక మనం అనుభవించని ఆ మధురానుభూతులు జీవితాంతం ఉంటే ఎంత బాగుంటుంది. అందుకే నేనెళ్లైనా నీ చంటి పాపల్లే ఉండిపోతే ఎంత బాగుంటుంది. ఓ పని చేస్తే నిన్నొదొలి వెళ్లే అవకాశమే రాకుండా ఉంటే ఎప్పటికీ నీతోనే ఉండిపోవచ్చు కదా. అందుకే నిన్నొదిలేంతగా ఎదగాలని నేను ఎప్పుడూ అనుకోను. ఇది కేవలం నా స్వార్థం మాత్రమే.
"అమ్మా...అణువణువణువూ నీ కొలువే..
ఎదసడిలో శ్రుతిలయలు నువ్వే...
అమ్మా....నే కొలిచే శారదవే..
నన్ను నిత్యం నడిపే సారథివే.....!!!"
అసలు నాకు ఈ రూపం ఎక్కడి నుంచి వచ్చింది. నా శరీరం ఎవరిది. నీదే కదా అమ్మా. నా అణువణువణువూ నీ కొలువే కదా అమ్మా. నా చిన్ని గుండే కూడా నీదే కదమ్మా. అందులో శ్రుతి లయల సడి... అదీ నీదే కదా. జీవితంలో నేనెంత గొప్ప వాడినైనా కావచ్చు. ఎంత పెద్ద స్థితికైనా చేరుకోవచ్చు. కానీ జీవితంలో తొలి పాఠాలు నాకు నేర్పిన నువ్వే కదమ్మా నాకు సరస్వతివి. అందుకే నే కొలిచే శారదవి నువ్వే. నువ్విచ్చిన ధైర్యంతోనే కదా అడుగులు వేసి ఇక్కడిదాకా చేరుకున్నా....నన్ను ముందుండి నడిపించిన సారథివి కూడా నువ్వే కదమ్మా.
"బెదురు పోవాలంటే..నువ్వు కనిపించాలి
నిదుర రావాలంటే కథలు వినిపించాలి..
ఆకలైందంటే నువ్వే తినిపించాలి
ప్రతీ మెతుకూ నా బతుకనిపించేలా...."
చిన్నప్పుడు అన్నీ భయాలే నాకు. ఏ చిన్న శబ్దం వచ్చినా నన్ను భయపెట్టడానికే అనుకునే వాడిని. నీ కడుపులో నుంచి బయటికి వచ్చిన నాకు ఈ లోకమే కొత్త కదా అందుకే ఈ ఏడుపు. కానీ నువ్వు కనపడితే ఆ బెదురంతా పోతుంది. మరి నిదుర రావాలంటే అప్పుడు కూడా నువ్వే. నీ ఒళ్లో తల పెట్టి నే పడుకుంటే నువ్వు మంచి కథలు చెబుతావ్. ప్రేమగా నా తల నిమిరుతుంటావ్. తెలియకుండానే నిదురలోకి జారిపోతుంటా. నా ఆకలి గురించి కూడా నీకు తెలిసినంతగా ఎవరికైనా తెలుసా. నువ్వు తినిపిస్తుంటే ఆ క్షణం కంటే స్వర్గం ఏమన్నా గొప్పగా ఉంటుందా. అందుకే ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా అప్పుడు నువ్వు తినిపించిన ప్రతీ మెతుకే కదా ఈ రోజు నా బతుకు అనిపిస్తోంది.
"నువ్వుంటే నేను...నువ్వంటే నేను
అనుకోలేకపోతే ఏమైపోతాను
నీ కడచూపే నన్ను కాస్తూ ఉండక
తడబడి పడిపోనా చెప్పమ్మా....!!!!"
నువ్వుంటేనే నేను ఉండగలను. అసలు నువ్వంటేనే నేను కదమ్మా. అలా అనుకోలేకపోతే అసలుండలేను . నీకు గుర్తుందా నీకు దూరం జరిగే ప్రతీ సారి ఓ కంట నన్ను కాచుకుంటూ కూర్చుంటావ్ కదమ్మా. ఒక వేళ ఆ కడచూపుతో నన్ను చూసుకోకపోతే నా పరిస్థితేంటి. తడబడి పడిపోతాను అమ్మ నిజంగా. అది ఇప్పుడైనా..జీవితంలోనైనా.
"మరిమరి నను నువ్వు మురిపెంగా...
చూస్తూ ఉంటే చాలమ్మా....
పరిపరివిధముల గెలుపులుగా...
పైకి ఎదుగుతూ ఉంటానమ్మా".
ఐనా సరే ఏనాటికీ..
ఉంటాను నీ పాపాయినై...
నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే...!!!!
నువ్వు అలా ప్రేమగా చూసుకుంటూ ఉండు చాలమ్మా....అడుగు పెట్టిన ప్రతీ చోట నీ ప్రేమతో, ఆశీర్వాదంతో గెలిచి పైకి ఎదుగుతాను అమ్మా. ఇది నిజం. నేను విశ్వవిజేతనే అయినా కూడా నీ పాపాయిలా...నీకిష్టమైన నీ బుజ్జాయిలా ఉండిపోతానమ్మా. ఎందుకంటే నిన్నొదిలేంతగా ఎదగాలని నేనెప్పుడూ అనుకోను. ఒకవేళ ఏదైనా నిన్ను వదిలేస్తేనే గెలుపు అనుకుంటే...నాకు అది కూడా అవసరం లేదు. నువ్వుంటే చాలమ్మా. నీప్రేమ ఉంటే చాలమ్మా. ఇంకేం అవసరం లేదు ఈ జీవితానికి.
శర్వానంద్ నటిస్తున్న కొత్త చిత్రం 'ఒకే ఒక జీవితం' చిత్రంకోసం.....జేక్స్ బిజోయ్ ఇచ్చిన ట్యూన్ కి....ఓ పసివాడిలా మారి సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాట ఇది. సిద్ శ్రీరామ్ తన గాత్రంతో మరో స్థాయికి తీసుకెళ్లాడు. సీతారాముడు గొప్పవాడైనా కావచ్చు. కానీ అమ్మ ముందు చిన్నోడే కదా. అందుకే ఎక్కడా తన పాండిత్యం ప్రదర్శించాలనుకోలేదు. అమ్మపై ఉన్న ప్రేమను సిరివెన్నెలలా కురిపించేశాడు. కష్టమైన పదాలు వల్లెవేసి అమ్మను మెప్పించాలని అనుకోలేదు. తనకి కూడా అర్థమయ్యే పదాలతో ప్రేమను గుప్పించాడు. తనకు తెలుసో తెలియదో తన చివరి పాటల్లో ఇదో పాటవుతుందని. అమ్మ గురించి మాట్లాడుకోవటానికి ఇదే చివరి అవకాశం అనుకున్నాడేమో...ఇంత హృద్యంగా రాసుకున్నాడు. ఎక్కడా సందర్భం...పాత్ర ఔచిత్యం నుంచి బయటకు రాకుండానే ...తన మాటల్లో అమ్మకు ప్రేమతో ఓ చివరి లేఖ రాసుకున్నాడు. ఆ తీపి జ్ఞాపకాలను మనతో చిరకాలం ఉండిపోయేలా పంచుకున్నాడు. థాంక్యూ సీతారాముడు. తెలుగు సినిమాపై నీ సంతకం అజరామరం. మాకో మధుర జ్ఞాపకం.