మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం పాటల నుంచి వెతుక్కోవచ్చా..? ఇది అర్థం లేని ప్రశ్న అనుకుందామంటే ఎందుకు కొంత మంది సాహిత్యకారులతో అంతలా కనెక్ట్ అయిపోతాం. పాట బాగుంటే ఆ పాటను స్వరపరిచిన సంగీత దర్శకుడికి గౌరవం వెళుతుంది. కానీ పాటకు గౌరవం రావాలంటే మాత్రం అందులో మనిషిని కదిలించగలిగే, మెదడుకు పదును పెట్టి ఆలోచింపచేసే  సాహిత్యం ఉండాలనేది సిరివెన్నెల సీతారామశాస్త్రి నిర్దేశించి వెళ్లిన నియమం. అందుకే ఆయన రాసిన ప్రతీపాట ఓ స్థాయి గౌరవాన్ని అందుకుంది. ఈ రోజు ఆయన జయంతి. ఈ లోకాన్ని సీతారాముడు విడిచి వెళ్లిన తర్వాత చేసుకుంటున్న మొట్టమొదటి పుట్టినరోజు. అసలు ఏముంది సిరివెన్నెల పాటల్లో ఆయన భౌతికంగా మన మధ్య లేరన్న చేదు నిజం ఎందుకు ఇంత మందినీ నేటికీ కదిలిపోయేలా చేస్తోంది.


బంధాలు అనుబంధాలు, డబ్బు సంపాదన, ఉద్యోగం, చదువు ఈ ప్రయాణంలో వీటి మధ్యలో ఎక్కడో మనిషి అలసిపోతాడేమో. ఇక తన వల్ల కాదని అస్త్రసన్యాసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో. సరిగ్గా అలాంటి చోటే సిరివెన్నెల నేనున్నంటూ కురుస్తుంది. లేదంటే  సాహసం నా పథం, ఒప్పుకోవద్దరూ ఓటమి, ఘల్ ఘల్ ఇలాంటి పాటలు ఎందుకు గుర్తుకు వస్తాయి చెప్పండి.  


వేడితే లేడి ఒడి చేరుతుందా
వేట సాగాలి కాదా హహ
ఓడితే జాలి చూపేనా కాలం
కాల రాసేసిపోదా
అంతము సొంతము పంతమే వీడను
మందలో పందలా ఉండనే ఉండను
భీరువల్లే పారిపోను రేయి ఒళ్ళో దూరిపోను
నే మొదలు పెడితే ఏ సమరమైనా
నాకెదురు పడునా ఏ అపజయం
సాహసం నా పథం రాజసం నా రధం
సాగితే ఆపటం సాధ్యమా||      (చిత్రం : మహర్షి (1988))



నొప్పి లేని నిమిషమేది జననమైన
మరణమైన జీవితాన అడుగు అడుగునా
నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు
బ్రతుకు అంటే నిత్య ఘర్షణ
దేహముంది ప్రాణముంది నెత్తురుంది
సత్తువుంది ఇంతకన్న సైన్యముండునా
ఆశ నీకు అస్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను
దీక్షకన్న సారధెవరురా
నిరంతరం ప్రయత్నమున్నదా
నిరాశకే నిరాశ పుట్టదా
నిన్ను మించి శక్తి ఏది నీకె నువ్వు బాసటైతే 
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం
అప్పుడే నీ జయం నిశ్చయంరా ॥  (చిత్రం : పట్టుదల (1992))


మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే
పండే పొలము చెపుతుందే పదునుగా నాటే నాగలి పొటే చేసిన మేలంటే
తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే గెలుపంటే
తను కొలువైవుండే విలువే వుంటే అలాంటి మనసుకు తనంతా తానై అడగక
దొరికే వరమే వలపంటే
జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత వుంటే నడకల్లో తడబాటైనా నాట్యం ఐపోదా
రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు వుంటే ఆ కాంతే నువ్వెతికే సంక్రాంతై ఎదురవదా 
ఘల్ ఘల్ ఘల్ ఘల్|| ( చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా(2005))



భయాన్ని పారద్రోలి, ధైర్యాన్ని నింపటమే కాదు ప్రశ్నించే తత్వాన్ని నేర్పాయి సిరివెన్నెల పాటలు. స్వతంత్ర భారతావనిలో మనం సాగిస్తున్న ప్రయాణం సరైనదేనా అని ధైర్యంగా ప్రశ్నించాయి. సమాజాన్ని పట్టిపీడిస్తున్న సామాజిక రుగ్మతలనీ ఏకిపారేశాయి. ఆ సమయంలో అవి కేవలం పాటల్లా కాకుండా తూటాల్లా పేలాయి.


కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే, జనాలు తలలర్పిస్తారే
సమూహక్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ
మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే
అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి? పోరి, ఏమిటి సాధించాలి?
ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సిందూరం
జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా! ఓ అనాథ భారతమా!
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా! స్వర్ణోత్సవాలు చేద్దామా!
ఆత్మవినాశపు అరాజకాన్ని స్వరాజ్యమందామా! దానికి సలాము చేద్దామా!
                                                                               (చిత్రం: సింధూరం(1997))


సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ
సుఖాన మనలేని వికాసమెందుకనీ
నిజాన్ని బలికోరే సమాజమెందుకనీ
అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం


ఆవేశంలో ప్రతి నిమిషం ఉరికే నిప్పుల జలపాతం
కత్తి కొనల ఈ వర్తమానమున బ్రతకదు శాంతి కపోతం
బంగరు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు
భస్మాసుర హస్తాలై ప్రగతికి సమాధి కడుతుంటే
శిరసు వంచెనదిగో ఎగిరే భరత పతాకం
చెరుగుతోంది ఆ తల్లి చరితను విశ్వవిజయాల విభవం || సురాజ్యమవలేని ||
                                                                                  (చిత్రం:గాయం(1993))


గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం                            (చిత్రం:గాయం(1993))


సంగీతం గొప్పతనాన్ని వినిపించిన పాటలు, నిందాస్తుతిలో భగవంతుడి సందేశాన్ని అందించిన పాటలు సిరివెన్నెల కలం నుంచి వచ్చిన పాటలు చరిత్రలో శాశ్వతత్వాన్ని ఆపాదించుకున్నాయి. 


సరస స్వర సుర ఝారీగమనమౌ సామ వేద సార మిది
నేపాడిన జీవన గీతం ఈ... గీతం..
విరించినై విరచించితిని ఈ కవనం..
విపంచినై వినిపించితిని ఈ గీతం....
ప్రాగ్దిశ వీణియ పైన దినకర మయూఖ తంత్రులపైనా..
జాగృత విహంగ తతులె వినీల గగనపు వేదిక పైన... ||2||
పలికిన కిలకిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా..
విశ్వకావ్యమునకిది భాష్యముగా....||                 (చిత్రం:సిరివెన్నెల(1986))


 


ఆది భిక్షువు వాడినేది కోరేది...
బూడిదిచ్చేవాడినేది అడిగేది...
ఏది కోరేది | వాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది


తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది
తీపి రాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవాడినేది కోరేది
తరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది
ఏది కోరేది | వాడినేది అడిగేది                        (చిత్రం:సిరివెన్నెల(1986))


ఒంటరితనంలో అద్వైతం వినిపించొచ్చా. చీకటిని కలంతో కనిపించేలా చేయొచ్చా. నువ్వు నేను వేరుకానప్పుడు, జీవాత్మ పరమాత్మ ఇన్ని లేవని ఉన్నదొక్కటి ఒక్కటేనని అది నువ్వేనని నిగూఢ అర్థాలతో సిరివెన్నెల సాగించిన పాటల వేట నీ ఒంటరి తనాన్ని తరిమి తరిమి కొడుతుంది. నేనున్నారా నేస్తం అంటూ నీకు మానసిక ధైర్యం ఇస్తుంది. 


ఉదయం కాగానే, తాజాగా పుడుతూ ఉంటా
కాలం ఇపుడే నను కనదా
అనగనగా అంటూ నే ఉంటా, ఎపుడు పూర్తవనే అవకా
తుది లేని కథ నేనుగా


గాలి వాటం లాగా ఆగే అలవాటే లేక
కాలు నిలవదు యే చోటా
నిలకడగ
యే….. చిరునామా లేక
యే బదులు పొందని లేఖ
ఎందుకు వేస్తుందో కేక….. మౌనంగా...             (చిత్రం:జాను(2020))


ఎన్నో రంగుల జీవితం నిన్నే పిలిచిన స్వాగతం
విన్నా నీలో సంశయం పోదా
ఉంటే నీలో నమ్మకం కన్నీరైన అమృతం
కష్టం కూడా అధ్భుతం కాదా


బొటానికల్ బాషలో మెటల్స్ పూరేకులు
మెటీరియల్ సైన్స్ లో కలలు మెదడు పెనుకేకలు
మెకానికల్ శ్వాసలో ఉసూరనే ఊసులు
మనస్సు పరి భాషలో మధురమైన కథలు


పొందాలంటే విక్టరీ పోరాటం కంపల్సరీ
రిస్కంటే ఎల్లామరి బోలో
ఎక్కాలంటే హిమగిరి ధిక్కారం తప్పనిసరి
కాలం మొక్కే హిస్టరీ లిఖనా


ఇథోఫియా ఊహలో అటో ఇటో సాగుదాం
యుకోరియా ఊపులో ఎగసి ఎగసి చెలరేగుదాం
ఫిలాసఫీ చూపులో ప్రపంచమో బూటకం
ఎనాటమి ల్యాబులో మనకు మనము దొరకం           (చిత్రం: జల్సా(2008))



ఇలా ఒకటా రెండు సిరివెన్నెల కలం నుంచి జాలువారిన ప్రతీపాట అజరామరమే. త్రివిక్రమ్ చెప్పినట్లు వచన కవిత్వానికి, సినిమా సాహిత్యానికి నోబెల్ స్థాయి గౌరవం తెచ్చిపెట్టినవాడు సీతారాముడు. భౌతికంగా మన మధ్య ఆయన లేకపోయినా...ఆయన పాటలు మనల్ని నవ్విస్తాయి...ఏడిపిస్తాయి..అద్వైతం చెబుతాయి...నేనున్నానురా బడుద్దాయి అని ఓదారుస్తాయి. మనతో తోడుగా నడుస్తున్నాయి. మార్గదర్శిలా ముందుండి దారి చూపిస్తాయి. మనతో మాట్లాడుతూనే ఉంటాయి.