కోలీవుడ్ నటుడు సిద్ధార్థ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘చిత్త’. ఈ నెల 28న తమిళనాట విడుదలైంది. తొలి షో నుంచే మంచి టాక్ సంపాదించుకుంది. సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. విమర్శకులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సిద్ధార్థ్ కెరీర్ లోనే అద్భుతమైన సినిమాగా అభివర్ణిస్తున్నారు. తల్లిదండ్రులు ఈ సినిమాను తప్పకుండా చూడాలని చెప్తున్నారు. ఈ చిత్రం త్వరలో తెలుగులోకి రాబోతోంది. ‘చిన్నా’ పేరుతో ప్రేక్షకులను ఆకట్టుకోబోతోంది.
ఆకట్టుకుంటున్న ‘చిన్నా’ ట్రైలర్
తాజాగా ‘చిన్నా’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది. సిద్ధార్థ్ ఇప్పటి వరకు చేయని డీగ్లామర్ రోల్ ఈ సినిమాలో చేశారు. ఈ ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చూసిన ప్రతి ఒక్కరిలోనూ సరికొత్త ఆలోచనలను రేకెత్తిస్తున్నది. సిద్ధార్థ్ మునుపెన్నడూ చేయని పాత్రలో కనిపించారు. ఇందులో సిద్ధార్థ్ పెర్ఫార్మెన్స్ ని చూసిన వారందరూ ఆయన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ గా ప్రశంసిస్తున్నారు. చిన్నాన్న, కూతురు మధ్య జరిగే భావోద్వేగ కథ ఈ సినిమా. స్కూలుకు వెళ్లే బాలికకు చిన్నాన్నగా సిద్ధార్థ్ అద్భుతమైన నటన కనబర్చారు. ఆ అమ్మాయి తప్పిపోవడంతో చిన్నాన్న పడే బాధ, ఆవేదనను దర్శకుడు అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సినిమాను ఒకేసారి తమిళం, కన్నడలో విడుదల చేశారు. ఇప్పుడు తెలుగులో ‘చిన్నా’గా వస్తోంది. సిద్ధార్థ్ సమర్పణలో ఎటాకి ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ ద్వారా తెలుగులో విడుదల చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు బాలాజీ సుబ్రమణ్యం సినిమాటోగ్రఫీ అందించారు.
తెలుగులో అక్టోబర్ 6న విడుదల
`చిన్నా` చిత్రానికి ఎస్.యు.అరుణ్‌కుమార్ దర్శకత్వం వహించారు. తమిళంలో `పన్నయారుం పద్మినియుం`, `సేతుపతి` సినిమాలతో డైరక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు అరుణ్‌కుమార్. ఈ చిత్రంలో సిద్ధార్థ్ సరసన మలయాళ నటి నిమిషా సజయన్ నటించారు. సిద్ధార్థ్ అన్న కూతురిగా సహస్ర శ్రీ నటించింది. ఈ చిన్నారి పాత్ర సినిమాలో ఎంతో కీలకంగా ఉండబోతోంది. తెలుగులో ఈ సినిమా 28న విడుదల కావాల్సి ఉన్నా, ‘స్కంద’, ‘చంద్రముఖి 2’, ‘పెదకాపు’ సినిమాలు క్యూ కట్టడంతో అక్టోబరు 6కు వాయిదా వేశారు.
ఒకప్పుడు తెలుగులో మంచి ఫాలోయింగ్
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ సినిమాలతో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సిద్ధార్థ్. ఈయనకు అప్పట్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. కానీ, ఆ తర్వాత ఆయన నటించిన పలు సినిమాలు పరాజయం పాలయ్యాయి. నెమ్మదిగా తెలుగులో తన మార్కెట్‌ను కోల్పోయారు. రెండేళ్ల క్రితం ‘మహా సముద్రం’ సినిమాతో సిద్ధార్థ్ మళ్లీ తెలుగులోకి వచ్చినా, పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ‘టక్కర్’ అనే సినిమాతో వచ్చారు. ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం ఎమోషనల్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను అలరించబోతున్నారు.
Read Also: నటి హరితేజకు విడాకులు- కూల్ గా ఆన్సర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial