పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) భౌతికంగా ప్రజలకు దూరమైనా... ఎప్పుడూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారని గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. 'వేద' ప్రీ రిలీజ్ వేడుక సాక్షిగా కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ఫ్యామిలీతో ఆయనకు ఉన్న అనుబంధం కళ్ళకు కట్టినట్లు కనిపించింది.


కన్నీళ్ళు పెట్టుకున్న శివన్న
పునీత్ సోదరుడు, రాజ్ కుమార్ పెద్ద కుమారుడు, కన్నడ స్టార్ హీరో శివ (Shiva Rajkumar) కథానాయకుడిగా నటించిన 125వ సినిమా 'వేద' (Vedha Telugu Movie). ఆల్రెడీ కన్నడలో విడుదల అయ్యింది. ప్రేక్షకుల అభిమానంతో పాటు భారీ వసూళ్ళు సాధించింది. గురువారం (ఫిబ్రవరి 9న) తెలుగులో సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి హైదరాబాదులో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. 


'వేద' ప్రీ రిలీజ్ వేడుకలో ప్రజలకు పునీత్ చేసిన సేవలను వివరించడంతో పాటు ఆయన సినిమాల్లో పాటలను, అన్నయ శివ రాజ్ కుమార్ తో అనుబంధాన్ని ఏవీ (ఆడియో విజువల్) రూపంలో ప్రదర్శించారు. అది చూసిన శివన్న కన్నీళ్ళు పెట్టుకున్నారు. పక్కనే కూర్చున్న బాలకృష్ణ ఆయన్ను ఓదార్చారు. ఈ సన్నివేశం చూసిన రాజ్ కుమార్ ఫ్యామిలీ అభిమానులతో పాటు పునీత్ అంటే ఇష్టపడే ఇతర భాషల ప్రేక్షకులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. 


Also Read : 'అన్‌స్టాపబుల్ 2' ఫైనల్‌కు పవర్ టచ్ - సూసైడ్, డిప్రెషన్‌పై పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్!


'వేద'ను కన్నడలో శివ రాజ్ కుమార్ భార్య గీత నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగులో కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ పతాకంపై ఎంవిఆర్ కృష్ణ విడుదల చేస్తున్నారు. 'వేద' ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బాలకృష్ణ మాట్లాడుతూ ''సినిమా ట్రైలర్ చాలా బాగుంది. శివన్నతో 'బజరంగీ 1', 'బజరంగీ 2' సినిమాలతో పాటు పునీత్ హీరోగా 'అంజనీ పుత్ర' తీసిన దర్శకుడు హర్ష ఇప్పుడీ 'వేద' తీశాడు. సినిమాలో విజువల్స్, మ్యూజిక్, కంటెంట్ అన్నీ బావున్నాయి. కన్నడలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా హిట్ కావాలి'' అని చెప్పారు.



బాలకృష్ణతో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేయాలనుంది - శివన్న
బాలకృష్ణ 'వేద' ప్రీ రిలీజ్ వేడుకకు రావడం పట్ల శివ రాజ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''బాలకృష్ణ గారి 100వ సినిమాలో నన్ను ఓ పాట చేయమని అడిగారు. చాలా సంతోషంగా చేశా. ఇప్పుడు పాట కాదు... ఆయనతో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ (సినిమా) చేయాలని ఉంది. దాని కోసం వెయిట్ చేస్తున్నాను'' అని చెప్పారు. ఎన్టీఆర్, ఏయన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ ఫ్యామిలీల మధ్య మంచి అనుబంధం ఎప్పటి నుంచో ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక నుంచి తన నుంచి వచ్చే సినిమాలను తెలుగులో విడుదల చేస్తానని తెలిపారు. 'వేద'లో మంచి వినోదంతో పాటు సందేశం ఉందని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఇది ఆకట్టుకునే చిత్రమని శివ రాజ్ కుమార్ తెలిపారు. తెలుగులో కూడా సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. 


Also Read : తెలుగింటి కోడలు కాబోతున్న లావణ్యా త్రిపాఠి - ఆ హీరోతో పెళ్లి!