YSRCP Politics : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి జగనన్నకు చెప్పుకుందాం అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించాని నిర్ణయించుకున్నారు. మూడున్నరేళ్ల పాలన తర్వాత ప్రజల నుంచి అందిన ఫీడ్ బ్యాక్ ను.. సీఎం జగన్ ఇంత కాలం ప్రజలను నేరుగా కలిసిన సందర్భం లేకపోడంతో.. ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. నిజానికి ప్రజాదర్భార్ పేరుతో ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం జగన్ మొదటే అనుకున్నారు. తేదీని కూడా ప్రకటించారు. కానీ అనూహ్యంగా రద్దయింది. ఆ తర్వాత మళ్లీ ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఎక్కువ మంది సమస్యలను ఆలకించాలంటే నేరుగా కలవడం కన్నా ఫోన్ ద్వారాఅయితే బెటరని అనుకుంటున్నారు. అందుకే జగనన్నకు చెప్పుకుందాం అనే కార్యక్రమానికి రూపకల్పన చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జగనన్నకు చెప్పుకుందాం !
రాష్ట్రంలో ప్రస్తుతం అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో మరింత జవాబుదారీ పెంచే విధంగా ‘జగనన్నకు చెబుతా’ కొత్త కార్యక్రమానికి రూపకల్పన జరుగుతోంది. ఈ కేబినెట్‌లో కార్యక్రమాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం కసరత్తు జరుపుతోంది.. గ్రామాల్లో ప్రజల నుంచి వచ్చే మెజారిటీ వినతులను గుర్తించి ఉన్నతాధికారి నుంచి కింది స్థాయి వరకు సమస్య పరిష్కారమయ్యే దిశగా యంత్రాంగాన్ని జాగృతం చేసే విధంగా సరికొత్త నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబరు కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ పోన్ నెంబర్‌కు కాల్ వచ్చిన వెంటనే అధికారులు సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నారు.ఇలా చేయడం ద్వారా ప్రజల్లో నమ్మకం పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
స్పందనకు అప్ డేటెడ్ వెర్షన్ !
ఇప్పటి వరకూ ప్రభుత్వం స్పందన పేరుతో ప్రతీ సోమవారం గ్రీవెన్స్ నిర్వహిస్తోంది. మొదట్లో చురుకుగా సాగిన ఈ గ్రీవెన్స్ తర్వాత పూర్తిగా వెనుకబడిపోయింది. సమస్యలు పరిష్కారం కావడం లేదన్న విమర్శలు ఎక్కువగా వచ్చాయి. దీంతో గ్రీవెన్స్ కు వచ్చే వారు తగ్గిపోయారు. అదే సమయంలో సీఎం జగన్ కు సమస్య చెప్పుకోవాలని ఆకాంక్షించేవారి సంఖ్య పెరిగిపోయింది. స్పందనలో పరిష్కారం రాకపోతే నేరుగా సీఎం జగన్ ను కలిసి చెప్పుకోవాలనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా జగనన్నకు చెప్పుకున్నట్లుగా ఉండేలా...ఫోన్ నెంబర్ ను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. దీనిపై కసరత్తు తుది దశకు వచ్చింది. కేబినెట్ భేటీ తర్వాత ఎప్పటి నుంచి ప్రారంభించే అంశంపై ఓ స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.
ప్రజల నమ్మకాన్ని పెంచుకోవడంలో ఈ కార్యక్రమం కీలకం!
ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందన్న అభిప్రాయం బలపడుతోంది. ఇలాంటి సమయంలో.. తమకు ప్రజలే ఫస్ట్ అని నిరూపించేలా ఈ జగనన్నకు చెప్పుకుందాం కార్యక్రమాన్ని అనూహ్య రీతిలో విజయవంతం చేయాలని అనుకుంటున్నారు. ప్రజలు పూర్తి స్థాయిలో సంతృప్తి పడేలా చేయాలనుకుంటున్నారు. సంక్షేమ పథకాలు అందలేదని ఎక్కువ మంది ఫిర్యాదులు చేసే అవకాశం ఉన్నందున దీనిపై ఎక్కువ కసరత్తు చేస్తున్నారు. ఎందుకు పథకాలు ఇవ్వలేకపోయారో.. స్ఫష్టంగా చెప్పనున్నారు. ఇలా చెప్పి వారిలో ఉన్న అసంతృప్తిని తగ్గించాలనుకుంటున్నారు. ఎలా చూసినా.. యాంటీ ఇన్ కంబెన్సీ అనేదాన్ని తగ్గించడానికి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నారు.