తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటుంది. ప్రధాన పార్టీలు ఇంటర్నల్ గా సమాయత్తమవుతూనే ఉన్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సంసిద్ధమవుతున్నాయి. ప్రధాన పార్టీల్లో టికెట్లు ఆశిస్తున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నుంచి టికెట్లు ఆశిస్తున్నవారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఆశావహుల సంఖ్య చాంతాడంత ఉంది. అయితే ఇప్పటికే సీఎం కేసీఆర్ సిట్టింగులకే సీట్లు అని చెప్పారు. దీంతో టిెకెట్ ఆశిస్తున్నవారు ఆందోళనలో ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆరు నియోజకవర్గాలు పార్లమెంట్ పరిధిలోకి వస్తాయ్. ఇప్పటికే ఈ ఆరు నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారు నిరాశకు గురవుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సిట్టింగులకే టికెట్లు అని చెప్పటంతో వారంతా పక్కచూపులు చూస్తున్నట్లు తెలుస్తోంది.
నిజామాబాద్ జిల్లాలో మొదట్నుంచీ బీఆర్ఎస్ పార్టీనే నమ్ముకుని ఉద్యమం సమయంలో నుంచి ఇప్పటి వరకు పార్టీలోనే ఉంటున్న వారు చాలా మందే ఉన్నారు. అయితే టికెట్ ఆశిస్తున్నవారు ఎన్నికలు వచ్చే నాటికి పరిస్థితితులను బట్టి అడుగులు వేద్దామని కొందరుంటే మరికొందరు టికెట్ ఆశిస్తున్న ఆశావహులు మాత్రం పక్కపార్టీల వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ లో టికెట్ రాకుంటే బీజేపీ లేదా కాంగ్రెస్ వైపు వెళ్లొచ్చనుకున్నవారికి అక్కడా చుక్కెదురయ్యే అవకాశమే ఉందని మదన పడుతున్నారంట. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోనూ ఆశావహుల సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా పార్టీల్లోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఇప్పటికే జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో బీజేపీలో ముగ్గురి నుంచి నలుగురు పార్టీ నాయకులు టికెట్ కోసం ఆశిస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీలోనూ ఒక్కో నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇటు బీజేపీ, కాంగ్రెస్ ఇప్పటికే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలపై ఓ లుక్కేశారు. ఆయా నియోజకవర్గాల్లో సామాజిక కోణం, ఆర్థిక, అంగ బలం ఉన్న నాయకులను బరిలో దింపేందుకు కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
ఇక దీంతో ప్రధాన పార్టీల్లో టికెట్ ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. ఎలాగైనా బరిలో ఉండాలని అని అనుకుంటున్న నాయకులు మాత్రం..... ఒకవేళ తామనుకున్న పార్టీలో టికెట్ రాకుంటే... ఎంఐఎం, లేదా ఆమ్ ఆద్మీ, వైఎస్ఆర్ టీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి నుంచి ముందస్తుగా ఓ కర్చీఫ్ పడేస్తే పోలా అనుకుంటున్న ఆశావహులు మాత్రం ఇప్పటి నుంచే ఆయా పార్టీల అధినేతలకు టచ్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఎక్కడా టికెట్ దొరక్కుంటే చివరికి జనసేన పార్టీ నుంచైనా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారు కూడా ఉన్నారు.
మొత్తానికి ప్రధాన పార్టీల్లో టికెట్ ఆశించి భంగపడితే మాత్రం ఇప్పుడు ఈ పార్టీలే దిక్కనుకుంటున్నారు టికెట్ ఆశిస్తున్న ఆశావహులు. ప్రజల్లో కాస్త పలుకుబడి ఉండి కాస్తో కూస్తో ఖర్చు చేసే నాయకులు మాత్రం ఈ సారి ఎలాగైనా పోటీ చేసేందుకు సన్నద్దమవుతున్నారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన వివిధ పార్టీల సీనియర్ నాయకులు తాము ఆశిస్తున్న పార్టీలో టికెట్ రాకుంటే మాత్రం వారైనా లేక వారి కొడుకులనైనా ఇతర పార్టీల్లోంచి బరిలోకి దింపేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.