Aadavallu Meeku Johaarlu: కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్(Sharwanand), రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోహీరోయిన్లుగా నటిస్తున్న‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ టీజర్ విడుదల అయింది. శర్వానంద్ చాలా రోజుల తర్వాత చేస్తున్న ఫ్యామిలీ, కామెడీ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేసేలా జోవియల్‌గా టీజర్‌ను కట్ చేశారు. ఫిబ్రవరి 25వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.


టీజర్‌లో ఇంట్లో ఎక్కువ మంది ఆడవాళ్లు ఉండటంతో పెళ్లి కూతురును ఫైనల్ చేయడానికి ఇబ్బంది పడే యువకుడి పాత్రలో శర్వా కనిపించారు. ‘మనం రిజెక్ట్ చేసే స్టేజ్ నుంచి.. వాళ్లు రిజెక్ట్ చేసే స్టేజ్‌కి తీసుకువచ్చేశారు అన్నమాట.’ వంటి డైలాగులు, చివర్లో వెన్నెల కిషోర్‌తో జరిగే సంభాషణ మంచి కామెడీగా ఉంది. టీజర్ మొత్తం శర్వానంద్‌ను ఇష్టపడుతున్నట్లు కనిపించిన రష్మిక చివర్లో మాత్రం ‘మన పెళ్లి జరగదు’ అని చెప్పి నేను శైలజ తరహా ట్విస్టును ఇచ్చింది. ఓవరాల్‌గా యూత్‌ను, ఫ్యామిలీలను ఆకట్టుకునే విధంగా టీజర్‌ను విడుదల చేశారు.


ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మొదటి సింగిల్ ‘ఆడాళ్లూ.. మీకు జోహార్లూ..’ ఇప్పటికే విడుదల అయింది.