Aadavallu Meeku Joharlu: శర్వానంద్ (Sharwanand), రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరో, హీరోయిన్లుగా... కిషోర్ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ ట్రైలర్ విడుదల అయింది. కామెడీ, ఎమోషన్, లవ్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేస్తూ ఆడియన్స్‌లో అంచనాలు పెంచే విధంగా ఈ ట్రైలర్‌ను కట్ చేశారు.


మార్చి 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు (Aadavallu Meeku Johaarlu)’, ‘ఓ మై ఆద్య (Oh My Aadhya)’, ‘ఆసమ్ (Awesome)’, ‘మాంగల్యం (Mangalyam)’ పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్లుగా నిలిచాయి. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీనే విడుదల కావాల్సి ఉండగా... పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ కారణంగా మార్చి 4వ తేదీకి వాయిదా పడింది.


ఖుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశి, వెన్నెల కిషోర్, సత్య, రవి శంకర్, ప్రదీప్ రావత్‌లు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను సోనీ లివ్ దక్కించుకుంది.


2016లోనే ప్రారంభమై...


నిజానికి ఈ సినిమా 2016లోనే వెంకటేష్, నిత్య మీనన్‌లతో ప్రారంభం అయింది. అయితే కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. ఆ తర్వాత శర్వానంద్, రష్మిక మందన్నలతో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఆ తర్వాత ఈ స్క్రిప్టుకు ఎన్నో మార్పులు చేసినట్లు కిషోర్ తెలిపారు.


శర్వానంద్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం. ఎందుకంటే 2017లో వచ్చిన మహానుభావుడు తర్వాత శర్వానంద్ ఇప్పటివరకు హిట్టు ముఖం చూడలేదు. పడి పడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం సినిమాలు డిజాస్టర్లు కావడంతో శర్వా కెరీర్ ప్రస్తుతం స్లంప్‌లో నడుస్తోంది. శర్వానంద్ తర్వాతి సినిమా ‘ఒకే ఒక జీవితం’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.