Ukraine Telugu Students: ఉక్రెయిన్ లో భీకర యుద్ధం జరుగుతోంది. అన్ని వైపుల నుంచి రష్యా(Russia) దాడులు చేస్తుంది. సైనిక చర్యగా రష్యా చెబుతున్నా పౌరులపై కూడా దాడి జరుగుతోందని ఉక్రెయిన్ ఆరోపిస్తుంది. అయితే ఈ సంక్షోభంలో అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థులు(Indian Students) తరలించడం సాహసోపేతమైన చర్య. ఉక్రెయిన్ తమ గగనతలాన్ని మూసివేసింది. విమానాల రాకపోకలకు అవకాశం లేదు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. భారత త్రివర్ణ పతాకంతో ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు వస్తే అక్కడ నుంచి దేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ విధంగా శనివారం 219 మందితో తొలి విమానం ముంబయి చేరింది. రొమేనియా నుంచి 250 మందితో, బుడాపెస్ట్ నుంచి 240 మందితో మరో రెండు విమానాలు దిల్లీకి చేరాయి. ఇప్పటి వరకూ 709 మంది భారతీయ విద్యార్థులు దేశానికి చేరుకున్నారు.
విద్యార్థులను ఉచితంగా తీసుకువచ్చేందుకు చర్యలు
ఉక్రెయిన్(Ukraine) నుంచి రొమేనియా చేరుకున్న వారిలో కొంత మందిని దేశానికి తీసుకొచ్చారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 28 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 17 మంది తెలంగాణ విద్యార్థులు ఆదివారం దిల్లీకి చేరుకున్నారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన వారిని ఉచితంగా తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ఏపీకి చెందిన 11 మంది విద్యార్థులు కూడా ఉక్రెయిన్ నుంచి దిల్లీ చేరుకున్నారు. వారిని రాష్ట్ర అధికారులు ఏపీ భవన్(AP Bhavan)కు తీసుకెళ్లారు. ఏపీ భవన్‌లో ఉన్న 11 మంది విద్యార్థులు తమ స్వస్థలాకు చేరుకుంటున్నారు. నిన్న ముంబయి(Mumbai)కి 20 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చేరుకున్నారు. దిల్లీ(Delhi)లో ఇరు రాష్ట్రాలు విద్యార్థుల కోసం హెల్ఫ్ డెస్క్ లు ఏర్పాటు చేశాయి.
ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు మరవలేం : విద్యార్థులు
తూర్పు గోదావరి జిల్లా మధురపూడి ఎయిర్ పోర్టుకు ఉక్రెయిన్ లో మెడిసిన్(Medicine) చదువుతున్న విద్యార్థినులు చేరుకున్నారు. సుష్మా, సుదర్శనలను ఎయిర్ పోర్టులో కుటుంబ సభ్యులు రిసీవ్ చేసుకున్నారు. ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలో ఉన్నామని అక్కడ యుద్ధం ప్రభావం అంతగా లేదని విద్యార్థినులు చెప్పారు. ఈస్ట్రన్ ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతుందన్నారు. యూనివర్సిటీ రుమేనియా బోర్డర్ కు దగ్గర ఉండటంతో త్వరగా రాగలిగామన్నారు. ఇంకా 15 వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ లో ఉండిపోయారన్నారు. సైరెన్ మోగినప్పుడు మెట్రో స్టేషన్, బంకర్స్ లో తలదాచుకున్నామని తెలిపారు. అక్కడ పరిస్థితులు రోజు రోజుకీ దిగజారుతున్నాయని విద్యార్థినులు చెప్పారు. ఉక్రెయిన్ లో చిక్కుక్కున్న విద్యార్థులను వెనక్కి రప్పించే ప్రయత్నాలు వేగంగా జరగాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని వెనక్కి తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలు మరువలేమన్నారు. ఉక్రెయిన్ నుంచి ముంబయి చేరుకున్న విద్యార్థులు వయా బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇవాళ ఉదయం రేణిగుంట(Renigunta) విమానాశ్రయానికి చేరుకున్న నవీన్ కు అధికారులు స్వాగతం పలికారు. మరి కొందరు విద్యార్థులు సాయంత్రం లోపు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారు