రోజుకు రూ.2 కోట్లు తీసుకుంటా అంటూ తన రెమ్యునరేషన్ పై పవన్ కళ్యాణ్  స్టేట్ మెంట్ ఇవ్వడాన్ని సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి హీరోలు సైతం ఏనాడు తమ రెమ్యునరేషన్ గురించి మాట్లాడలేదన్నారు. అలాంటి ఇప్పుడు మైకు పట్టుకొని కోట్లు రూపాయలు తీసుకుంటున్నామని చెప్పడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సినిమా అనేది సర్కస్ లా మారిపోయిందని విమర్శించారు. “రామారావు, నాగేశ్వర్ రావు, కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలు ఇప్పటి వరకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు? ఎవరు ఎవరికి ఎంత ఇచ్చారు? అనే విషయం ఎవరికీ తెలియదు. ఇవాళ మైకు పట్టుకుని నేను రోజుకు రూ. 2 కోట్లు తీసుకుంటున్నా, రూ. 6 కోట్లు తీసుకుంటున్నా, సినిమాకు రూ. 50 కోట్లు తీసుకుంటున్నా అని చెప్తున్నారు. ఇలా చెప్పడం మంచి పద్దతి కాదు. ఇకపై అలాంటి విషయాలను ప్రస్తావించకపోవడమే మంచిది. ఇవాళ సినిమా అనేది లేదు. సినిమా సర్కస్ లా తయారు అయ్యింది. రామారావు, శ్రీదేవి నటిస్తే, ఏం తీశార్రా? అన్నారు గానీ, ముసలాయన చేశాడు అని ఎవరూ అనలేదు. నేను చేస్తే ముసలోడు చేశాడు అంటారు. అలా తయారైంది సినిమా పరిశ్రమ పరిస్థితి” అని కోటా ఆవేదన వ్యక్తం చేశారు.  


పొలిటికల్ ర్యాలీలో రెమ్యునరేషన్ విషయాన్ని ప్రస్తావించిన పవన్


గత కొద్ది రోజుల క్రితం ఓ రాజకీయ ర్యాలీలో పవన్ తాను తీసుకునే రెమ్యునరేషన్ గురించి కీలక విషయాలు చెప్పారు.  తాను డబ్బు కోసమే అధికారంలోకి రావాలని చూస్తున్నానన్న విమర్శలపై ఆయన తీవ్రంగా స్పందించారు. తనకు డబ్బుతో పనిలేదని, సినిమాల్లోనే భారీగా సంపాదిస్తున్నట్లు వెల్లడించారు. తాను ఒక రోజు షూటింగ్ కోసం రూ.2 కోట్లు తీసుకుంటానని చెప్పాడు. "నాకు డబ్బు అవసరం లేదు. నేను అలాంటి మనిషిని కూడా కాను. అవసరమైతే నేను సంపాదించి. ఆ డబ్బును దాన ధర్మాల కోసం వినియోగిస్తాను. నేను ఎలాంటి భయం లేకుండా చెప్తున్నాను.  ఇప్పుడు నేనో సినిమా షూటింగ్ చేస్తున్నా. దాని కోసం రోజుకు రూ.2 కోట్లు వసూలు చేస్తున్నా. అంటే 20 రోజుల షూటింగ్ కు నాకు రూ.45 కోట్ల వరకూ ఇస్తున్నారు. నేను ప్రతి సినిమాకు ఇంత సంపాదిస్తున్నానని చెప్పడం లేదు. కానీ, నా రోజు వారీ రెమ్యునరేషన్ అంత ఉంటుంది” అని ఆ ర్యాలీలో వెల్లడించారు.   


వరుస సినిమాలతో పవన్ ఫుల్ బిజీ


ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తున్నారు. క్రిష్ జాగర్లమూడితో కలిసి ‘హరిహర వీరమల్లు’ సినిమా చేస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘OG(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) సినిమాలో  నటిస్తున్నారు. అటు హరీష్ శంకర్ తో కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమా చేస్తున్నారు.  అటు తమిళ మూవీ రీమేక్ లోనూ నటిస్తున్నారు. సముద్రఖని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు. తమిళంలో సముద్రఖని పోషించిన పాత్రతో తెలుగులో పవన్ పోషిస్తున్నాడు.  


Read Also: 'కేరళ స్టోరీ'ని ఎందుకు బ్యాన్ చేయాలి? నేను అయితే చేయను - కమల్ హాసన్ కొత్త కామెంట్స్