యుద్ధం అంటే రెండు దేశాలు కొట్టుకోవటం..వాటికి మద్దతుగా వచ్చే మరికొన్ని దేశాల పోరాటం. పైకి కనిపించే అర్థం ఇదే కావచ్చు....కానీ యద్ధం అంటే కొన్ని తరాలను బలిపెట్టడం. వందల వేల కుటుంబాలు రోడ్డున పడటం...ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, భవిష్యత్తు పై ఊహలు అన్నీపటా పంచలు చేయటం. ఒకే మానవ జాతిగా మొదలైన మన ప్రయాణం ఎక్కడో ప్రాంతాలు, దేశాలుగా విడిపోయింది. కారణాలేవైనా కానీ రాజ్యకాంక్ష, ఆధిపత్యం లాంటి ఎక్ట్రీమ్ ఎమోషన్స్ మనిషిని ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి. లేని వాడు తిండి కోసం ఏడుస్తుంటే... ఉన్నవాడు లేనివాడికి మెతుకు కూడా మిగలకుండా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బలవంతుడు నెగ్గుతాడు.. బలహీనుడు మరింతగా పాతాళంలోకి కూరుకుపోతాడు. యుద్ధం ఎక్కడ జరిగినా మానవాళికి నేర్పిన పాఠం ఇదే.


మరి ఇలాంటి పాఠాలు ఎన్ని నేర్చుకున్నా మళ్లీ యుద్ధానికి ఎందుకు వస్తున్నారు. ఇంకా యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి ఏమో ఒక్కొరికి ఒక్కో కారణం. కానీ  ఇరవై నాలుగేళ్ల క్రితం విడుదలైన ఓ సినిమా యుద్ధం క్రూరత్వాన్ని చూపించింది. ఆ భయానక పరిస్థితులను కళ్లకు కట్టింది.  ఎటు చూసినా మృతదేహాలు.. భీభత్సంగా తెగిపడిన కాళ్లు, చేతులూ, వాటిని పట్టుకునే మతి పోయినట్టు తిరుగుతున్న కొందరు సైనికులు.. ముక్కు పచ్చలారని 18 ఏళ్ల సైనికుల శరీరాలు.. సముద్రంలోంచి ఒడ్డుకి కొట్టుకొచ్చిన శవాలు.. ఆ యుద్ధంలో పాల్గొని తర్వాత ప్రాణాలతో మిగిలిన సైనికులు కొందరు సినిమాలో ఇవి చూసి కళ్ల నీళ్లు పెట్టుకున్నారని చెబుతారు. రెండో ప్రపంచ యుద్ధం మీద వచ్చిన వాటిలోకెల్లా ఇదే మంచి సినిమా అనేవాళ్లు చాలా మంది. ఇన్ని ప్రశంసలు, అంతకు మించిన సినిమా బాధ్యతను మోసింది.. 1998లో విడుదలైన సేవింగ్ ప్రైవేట్ ర్యాన్ అనే ఈ సినిమా.


దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ దర్శకత్వంలో రాబర్ట్ రోడేట్ రాసిన కథతో టామ్ హ్యాంక్స్, మ్యాట్ డెమోన్ లాంటి అద్భుతమైన నటులతో తెరకెక్కిన ఎపిక్ అమెరికన్ వార్ ఫిలిం సేవింగ్ ప్రైవేట్ ర్యాన్. ఈ సినిమా విడుదలై సరిగ్గా ఇరవై నాలుగేళ్లు అవుతోంది. రెండో ప్రపంచ యుద్ధం మీద వచ్చిన సినిమాల్లోన్నింటి కంటే గొప్ప సినిమాగా పేరు సంపాదించింది ఈ సినిమా.


కథ విషయానికి వస్తే...: రెండో ప్రపంచ యుద్ధ కాలంలో Normandy ప్రాంతాన్ని జర్మనీ ఆక్రమించిన సమయంలో జరిగే కథ ఇది. James Ryan అనే ఒక అమెరికా ఓ సైనికుడు  జర్మనీ ఆక్రమిత ఫ్రాన్స్ లో (Normandy ప్రాంతం) చిక్కుకుపోయి ఉండిపోతాడు. అతడి తల్లిదండ్రులకి మొత్తం నలుగురు అబ్బాయిలు. మొదటి ముగ్గురూ అప్పటికే యుద్ధంలో మరణిస్తారు. ఆ కుటుంబంలో ఇతనొక్కడినీ అయినా బతికించాలని  సైనిక జనరల్ George Marshall నిర్ణయించి అతన్ని కాపాడి వెనక్కి తీసుకు రావాలని ఏడుగురు సైనికులున్న బృందాన్ని పంపిస్తాడు. ఆ బృందానికి నాయకుడే Captain John Miller. ఓ స్కూల్లో ఇంగ్లీషు టీచర్. యుద్ధంలో సైనికులు పిట్టల్లా చనిపోవడం వల్ల వాళ్ళకి కొరత ఏర్పడి మామూలు పౌరుల్ని కూడా అప్పటికప్పుడు రిక్రూట్ చేసుకుని పంపిస్తున్న కాలమది. అప్పటికే Miller యుద్ధంలో పాల్గొని తన కింద చాలా మంది సైనికులు చనిపోవడాన్ని కళ్లారా చూసి ఉంటాడు. పోరాటం ముమ్మరంగా నడుస్తున్న Normandy లోనే  ఉంటాడు. జనరల్ Marshall అతడ్ని కొందరు సైనికుల్ని తీసుకువెళ్లి Ryan ని వెతికి పట్టుకుని వెనక్కి అమెరికా పంపమని ఆదేశిస్తాడు.. Miller ఆరుగురితో ఒక బృందం తయారు చేసి వెతకడానికి వెళ్తాడు. మొదట ఒక James Ryan ని పట్టుకుంటారు కానీ అతడు అసలు వ్యక్తి కాదు.


ర్యాన్ రామెల్లే (Ramelle) అనే ప్రాంతంలో ఒక వంతెనకి కాపలాగా ఉన్నాడని తెలుస్తుంది. అక్కడికి బయల్దేరతారు. దార్లో ఒక చిన్న ఘర్షణలో బృందంలోని ఒకరు చనిపోతారు. తర్వాత ఒక జర్మన్ సైనికుడు నిస్సహాయుడిగా ఎదురవుతాడు. అతన్ని చంపెయ్యాలని అందరూ అన్నా Miller అతన్ని వదిలేస్తాడు. అక్కడ అతని నాయకత్వ లక్షణాల్ని అనుమానించిన తన బృందానికి తన నేపథ్యం, తను ఒక స్కూలు టీచరనే విషయం చెబుతాడు.
 
Ramelle ప్రాంతంలో Ryan దొరుకుతాడు గానీ వెనక్కి తన దేశానికి తిరిగి వెళ్లడానికి ఇష్టపడడు. తన సోదరుల గురించి చెప్పినా అంత పట్టించుకోడు. దాంతో Miller బృందం కూడా ఆ వంతెనకి రక్షణగా అక్కడ ఉండి పోతుంది. అక్కడికి వచ్చిన జర్మన్ సైనికులతో భీకరమైన పోరాటం జరుగుతుంది. వాళ్ళు ఆ వంతెన దాటకుండా దాన్ని పేల్చెయ్యాలని Miller ప్రయత్నిస్తాడు. కానీ తను ఏ జర్మన్ సైనికుడినైతే అంతకుముందు చంపకుండా వదిలేశాడో ఆ సైనికుడే ఇప్పుడు అతని మీద కాల్పులు జరుపుతాడు. చివరి నిమిషం దాకా పోరాడి Miller మరణిస్తాడు. అతని బృందం ఎలాగో అక్కడి జర్మనీ సైనికులందర్నీ అంతం చేస్తుంది.


సినిమా మొదటి సీన్లో యుద్ధంలో పాల్గొని తిరిగి వచ్చిన ఒక సైనికుడు అమర వీరుల సమాధుల దగ్గరకి వెళ్తాడు. అక్కడ వరసగా వందల కొద్దీ సమాధులు.. అందరూ యుద్ధంలో మరణించిన వారే. అవి చూస్తే గుండె చెరువైపోతుంది. అక్కడ ఆ సైనికుడు ఒక సమాధి ముందు కళ్ల నీళ్లతో నివాళి అర్పిస్తాడు. అంత త్యాగానికి తను అర్హుడేనా అని ప్రశ్నించుకుంటాడు. అతడే James Ryan. తర్వాత కథంతా background గా వస్తుంది.. చివర్లో మళ్లీ అదే సీన్ తో సినిమా ముగుస్తుంది. ఆ సీన్ Normandy లో నిజంగా ఉన్న అప్పటి సమాధుల దగ్గర తీశారు.


Tom Hanks, Spielbergల కాంబినేషన్లో వచ్చినవన్నీ దాదాపు గొప్ప సినిమాలే. వాటన్నింటిలోకీ ఇది అద్భుతంగా ఉందనిపిస్తుంది. ఇది మొత్తం 11 అకాడమీ అవార్డులకి నామినేట్ అయింది. Best picture, best director తో సహా అయిదు దక్కించుకుంది. Omaha Beach లో సైనికులు లాండయ్యే సీన్ చాలా వాస్తవికంగా, అద్భుతంగా చిత్రీకరించారు.. అది Best battle scene of all time గా చాలా పత్రికలు కీర్తించాయి. రెండో ప్రపంచ యుద్ధం మీద వచ్చిన గొప్ప సినిమా అని ఇప్పటికీ సేవింగ్ ప్రైవేట్ ర్యాన్ పేరు ఉంది. నార్మండీ బీచ్ లో ఓ ఇరవై నిమిషాల రక్తపాతం సీన్ ఉంటుంది. దాన్ని చూస్తే చాలు యుద్ధం అంటే విరక్తి కలగటం ఖాయం. అంత రా గా గ్రిప్పింగ్ ఉంటుంది స్పీల్ బర్గ్ టేకింగ్.


Also Read: ‘యుద్ధం’ చూడాలని ఉందా? ఈ 8 వెబ్‌సీరిస్‌లు కట్టిపడేస్తాయ్, డోన్ట్ మిస్!


‘‘ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం?
నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం..
అని శ్రీశ్రీ చెప్పినది ఎంత నిజం!!’’
- యుద్ధం, పోరాటం, అమరవీరులు, సాహసం.. అని ఏవేవో మాటలు చెప్పుకుంటాం. కానీ నిజానికి ఏముంది యుద్ధంలో వీరత్వం?? దిక్కు లేని పరమ హింసాత్మకమైన మరణంలో ఏముంది గొప్పతనం?? మనిషికీ మనిషికీ మధ్య ఏ మాత్రం పడని తత్వం, కక్ష, కార్పణ్యం.. పదవి కోసమో, ధనం కోసమో దురాశ.. వీటి వల్లే కదా యుద్ధాలు జరిగేది!! అన్నీ తెలిసినా మనిషి ఎందుకో ఈ యుద్ధాలకి దూరంగా ఉండలేకపోతున్నాడు. నమ్మకపోతే సేవింగ్ ప్రైవేట్ ర్యాన్ ఓ సారి చూడండి. 


Also Read: సముద్రంలో మెగా స్క్రీన్‌పై ‘భోళాశంకర్’, జుహూ బీచ్‌‌లో చిరు అభిమానులకు సర్‌ప్రైజ్



Saving Private Ryan Trailer: