Sasivadane Movie Teaser: ‘లండన్ బాబులు’, ‘పలాస’ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న రక్షిత్ అట్లూరి నటిస్తున్న సినిమా ‘శశివదనే’. రక్షిత్‌కు జోడీగా కోమలీ ప్రసాద్ కనిపించనున్నారు. ఈ సినిమా టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. సాయి మోహన్ ఉబ్బన ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఫిబ్రవరిలో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోశాల ఈ సినిమాను నిర్మించారు.


ఇక టీజర్ విషయానికి వస్తే... 2000 దశకంలో గోదావరి జిల్లాల నేపథ్యంలో ఒక అందమైన ప్రేమకథ అనుకోవచ్చు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉన్నాయి. రక్షిత్, కోమలీల పెయిర్ కూడా చూడటానికి చాలా అందంగా ఉంది. టీజర్ లాస్ట్‌లో పాడుబడిపోయిన ఇంటిని చూపించి చిన్న సస్పెన్స్ కూడా క్రియేట్ చేశారు. గోదావరి అందాలను మాత్రం చాలా బాగా చూపించారు.



ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన 'శశివదనే శశివదనే... నువ్వుంటే చాలుగా! నీ వెనుకే... నా అడుగే!  నీ సగమే నేనుగా!' పాట పెద్ద హిట్ అయింది. ఈ గీతాన్ని ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ విడుదల చేశారు. 


'శశివదనే' సినిమాకు శరవణ వాసుదేవన్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. మణిరత్నం దర్శకత్వం వహించిన 'ఇద్దరు' సినిమాలో 'శశివదనే' పాట ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు విడుదల అయిన టీజర్‌ను చూస్తుంటే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. సినిమాను ఫిబ్రవరి నెలలో విడుదల చేయనున్నారు.


కోనసీమ, గోదావరి నేపథ్యంలో తెలుగులో ఇప్పటికే ఎన్నో చిత్రాలు వచ్చాయి. కుటుంబ కథలు కొన్ని, ప్రేమ కథలు ఇంకొన్ని ఇలా కోనసీమ నేపథ్యంలో వచ్చిన సినిమాల లిస్ట్ పెద్దదే. అలాగే యాక్షన్ సినిమాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. 'శశివదనే' గోదావరి జిల్లాల నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమే. కానీ 'గోదావరి నేపథ్యంలో రూపొందిన తొలి యాక్షన్ అండ్ లవ్ డ్రామా ఇది' అని నిర్మాత అహితేజ బెల్లంకొండ తెలిపారు. కానీ టీజర్‌లో యాక్షన్ కంటెంట్‌ను రివీల్ చేయలేదు. కోనసీమలో 50 రోజుల పాటు సినిమా షూటింగ్ కూడా చేయడం విశేషం. సినిమాలో రక్షిత్ శెట్టి అద్భుతంగా నటించాడని పేర్కొన్నారు. కోమలి ప్రసాద్ అందంతో పాటు అభినయానికి ఆస్కారం ఉన్న పాత్ర చేశారని వివరించారు.


నేటివిటీ ప్రాముఖ్యం ఇస్తూ తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రాలకు ఈ మధ్య మంచి ఆదరణ లభిస్తుందిది. భాషతో సంబంధం లేకుండా కథ, కథనాలు, నటీనటుల అభినయం బావుంటే ప్రేక్షకులు ఈ తరహా సినిమాలు చూస్తున్నారు. అందుకు ఉదాహరణ కన్నడంలో రూపొంది దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన 'కాంతార'. గోదావరి నేపథ్యంలో వస్తున్న 'శశివదనే' చిత్రానికి కూడా మంచి ఆదరణ లభించే అవకాశాలు ఉన్నాయి.


'శశివదనే' సినిమాలో రఘు కుంచె, తమిళ నటుడు శ్రీమాన్, కన్నడ నటుడు దీపక్ ప్రిన్స్, 'రంగస్థలం' మహేష్ , ప్రవీణ్ యండమూరి, 'జబర్దస్త్' బాబీ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి ఎడిటర్ : గ్యారీ బీహెచ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: శ్రీపాల్ చొల్లేటి, ఛాయాగ్రహణం : సాయికుమార్ దార, సాహిత్యం : కిట్టూ విస్సాప్రగడ, కరుణాకర్ అడిగర్ల, సంగీతం : శరవణ వాసుదేవన్, నేపథ్య సంగీతం : అనుదీప్ దేవ్.