సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక రీసెంట్ గా సినిమాలో ఫస్ట్ సింగిల్ 'కళావతి' అనే పాటను విడుదల చేశారు. ఈ పాట యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. ఇందులో మహేష్ బాబు స్టెప్స్ కి ఫ్యాన్ ఫిదా అయిపోయారు.
దీంతో ఈ పాటకు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నిన్ననే మహేష్ బాబు కూతురు సితార ఈ పాటకు తండ్రి స్టైల్ లో స్టెప్స్ వేసి ఆకట్టుకుంది. అంతేకాదు.. #KalaavathiChallenge అంటూ అభిమానులకు ఓ ఛాలెంజ్ విసిరింది. 'కళావతి' పాటకు రీల్స్ చేసి #KalaavathiChallenge పేరుతో వీడియోలను షేర్ చేయాలని కోరింది. అందులో తనకు నచ్చిన వీడియోలను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పెట్టుకుంటానని చెప్పింది.
ఇప్పుడు కీర్తి సురేష్ ఈ ఛాలెంజ్ ను స్వీకరించి 'కళావతి' పాటకు స్టెప్పులేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది. ఇక సినిమా విషయానికొస్తే.. మహేష్ బాబు కెరీర్‌లో 27వ సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ ను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మే 12న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.