Sapta Sagaralu Dhaati Side B Trailer: ప్రముఖ కన్నడ హీరో రక్షిత్ శెట్టి (Rakshit Shetty), రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా ‘సప్త సాగరాలు దాటి సైడ్-ఏ’. సెప్టెంబర్ 1వ తేదీన విడుదల అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో దాని రెండో భాగం ‘సప్త సాగరాలు దాటి సైడ్-బి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అక్టోబర్ 20వ తేదీన విడుదల కావాల్సి ఉండగా... పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అవ్వడంతో నవంబర్ 17వ తేదీకి వాయిదా పడింది. ఇప్పుడు ‘సప్త సాగరాలు దాటి సైడ్-బి’ ట్రైలర్‌ను విడుదల చేశారు.



ఇక ట్రైలర్ ఎలా ఉంది?
మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి తిరిగి రావడంతో ‘సప్త సాగరాలు దాటి సైడ్-బి’ ప్రారంభం అవుతుంది. అయితే విడుదల అయ్యాక కూడా ప్రియ (రుక్మిణి వసంత్)ను మర్చిపోలేకపోతాడు. కానీ కాలక్రమంలో మరో అమ్మాయి (చైత్ర జే ఆచార్)కి దగ్గర అవుతూ ఉండగా... తిరిగి అనుకోకుండా ప్రియ కనిపిస్తుంది. ఆ తర్వాత మను తిరిగి ప్రియతో మాట్లాడటం, తనను అన్యాయంగా జైలులో వదిలేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవడం లాంటి అంశాలను ట్రైలర్‌లో చూపించారు. ఇందులో వయొలెన్స్ పాళ్లు కూడా కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. ట్రైలర్ చివర్లో వచ్చే సీన్ ఆకట్టుకుంటుంది.


ఇందులో డైలాగులు కూడా బాగున్నాయి. ‘జైలు నుంచి వచ్చిన కొత్తలో లైఫ్ కొన్నాళ్లు కష్టంగా ఉంటుంది. ఏం బాధ పడకు. కొంచెం పెద్ద జైలుకి వచ్చాననుకో.’ లాంటి సంభాషణలు ఆలోచింపజేస్తాయి. మొదటి భాగం పూర్తిగా లవ్ స్టోరీ నేపథ్యంలో నడవగా... రెండో భాగం మను, ప్రియని మర్చిపోవాలనుకోవడం, తనను జైలుకు పంపిన వారిపై పగ తీర్చుకోవడం నేపథ్యంలో సాగనుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.


ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇది ప్రస్తుతం సినీ అభిమానులకు ఆకట్టుకుంటోంది.  మను జైల్లో ఉన్న సీన్ తో స్టార్ట్ అయ్యి ప్రియ చెప్పే మాటలను పాత కాలపు వాక్‌మన్‌లో వింటున్నట్లుగా చూపించారు. ఒకే టీజర్ లో తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ డైలాగులు పెట్టడం ఆసక్తికరంగా ఉంది. టీజర్ కు చరణ్ రాజ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.


‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ ఎ’ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించగా.. ‘సప్త సాగరదాచే ఎల్లో - సైడ్ బి’లో చైత్ర జే ఆచార్ (Chaitra J Achar) కూడా కథానాయక పాత్రలో కనిపించనుంది. పరమ్‌వాహ్ స్టూడియోస్ బ్యానర్‌పై రక్షిత్ శెట్టి స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. చరణ్ రాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.