Telangana Elections 2023 :   తెలంగాణలో రాజకీయం సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలతో  కొత్త కొత్త వివాదాలకు కారణం అవుతోంది. తాజాగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే  శివకుమార్ .. హైదరాబాద్‌లో ఫాక్స్ కాన్ పెట్టిన యాపిల్ ఉత్పత్తుల పరిశ్రమను బెంగళూరుకు తరలించలని ఓ లేఖ  రాసినట్లుగా బీఆర్ఎస్ నేతుల ప్రచారం ప్రారంభించారు. ఓ లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేసి.. కాంగ్రెస్ గెలవక ముందే  హైదరాబాద్ పరిశ్రమల్ని తెలంగాణకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇక గెలిస్తే.. హైదరాబాద్ ను ఖాళీ చేసి బెంగళూరుకు తరలిస్తారని ఆరోపించడం ప్రారంభించారు. ఈ అంశం పై రాజకీయ దుమారం రేగింది.                    


కర్ణాటక ఎన్నికల్లో డీకే శివకుమార్ కూడా తెర వెనుక కీలక పాత్ర పోషిస్తున్నారు. తెర వెనుక వ్యూహాలు, పార్టీలో చేరికలు అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇటీవల ఒక  రోజు డీకే శివకుమార్ ..ఎన్నికల ప్రచారం కూడా చేసి వెళ్లారు.  కొన్నాళ్లుగా బీఆర్ఎస్ పార్టీ నేతలు శివకుమార్ ను టార్గెట్ చేసుకుంటున్నారు. కేటీఆర్ ఆయనపై నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. కర్ణాటక కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకుని తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు  ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలో ఐదు గంటలే కరెంట్ ఇస్తున్నారని.. అక్కడ హామీలు ఏమీ అమలు చేయలేదని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు.          


ఈ క్రమంలో  డీకే శివకుమార్ రాసినట్లుగా చెబుతున్న లేఖను వైరల్ చేయడంతో దుమారం రేగింది. చివరికి ఈ లేఖ విషయం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు చేరింది. తాను అటువంటి లేఖ  ఫాక్స్ కాన్ కంపెనీకి రాయలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు సర్క్యూలేట్ చేస్తున్న లేఖ ఫేక అని దానిపై బెంగళూరులో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా తెలిపారు.                                  


 





 



డీకే శివకుమార్ క్లారిటీ తర్వాత  కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పై ఎదురుదాడి ప్రారంభించారు. ఫేక్ ప్రచారంతోనే బీఆర్ఎస్ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఇందు కోసం కొన్ని వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎంత  ఫేక్ చేసినా బీఆర్ఎస్ పార్టీని గెలిపించే అవకాశం ఉండదని హెచ్చరిస్తున్నారు.