Sankranthi Release Telugu Movies 2023 : సంక్రాంతి బరిలో వచ్చే సినిమాలు దాదాపు ఖరారు అయ్యాయి. స్టార్ హీరోలు సంక్రాంతి సమరానికి సై అంటూ విడుదల తేదీలు ప్రకటించారు. నట సింహం నందమూరి బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి', తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ 'వారసుడు' సినిమాలు జనవరి 12న థియేటర్లలోకి రానున్నాయి. ఆ మరుసటి రోజు మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య' వస్తుంది. జనవరి 13న సినిమా విడుదల అని నిన్న ప్రకటించారు. ఈ మూడు సినిమాలకు ముందు జనవరి 11న అజిత్ 'తునివు' థియేటర్లలోకి రానుంది. సంక్రాంతి సందడి ఈ సినిమాలదే అనుకోవద్దు. వీటితో పాటు మరో చిన్న సినిమా కూడా సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో దిగుతోంది.


యువ కథానాయకుడు రాహుల్ విజయ్ (Rahul Vijay), యాంగ్రీ స్టార్ రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని (Shivani Rajasekhar) జంటగా నటించిన సినిమా 'విద్య వాసుల అహం' (Vidya Vasula Aham Movie). ఏ లాంగ్ లాంగ్ ఈగో స్టోరీ... అనేది ఉపశీర్షిక. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. ''సంక్రాంతికి అల్లుడే కాదు... అమ్మాయి కూడా వస్తుంది'' అంటూ జనవరి 14న థియేటర్లలోకి చిత్రాన్ని తీసుకు వస్తున్నట్టు నిర్మాతలు అనౌన్స్ చేశారు. 


నాలుగు భారీ సినిమాల మధ్య 'విద్య వాసుల అహం' చిత్రానికి ఎన్ని థియేటర్లు లభిస్తాయి? దీనికి ప్రేక్షకుల నుంచి ఎటువంటి ఆదరణ లభిస్తుంది? పెద్ద పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమా ఏ విధంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది? అనేది చూడాలి.


Also Read : స్టార్ డైరెక్టర్స్ పరువు తీసిన 2022 - ఈ ఏడాది వీళ్ళ స్టార్ బాగోలేదనుకుంట!


ఓటీటీలో విడుదలైన 'అద్భుతం' సినిమా, 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్‌తో శివానీ రాజశేఖర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రాహుల్ విజయ్ ప్రామిసింగ్ మెటీరియల్ అనిపించుకున్నారు. ఫస్ట్ లుక్, పోస్టర్లు ఆసక్తిగా ఉండటం 'విద్య వాసుల అహం' సినిమాకు కలిసి వచ్చే అంశం.  


పెళ్ళైన కొత్తలో జంట మధ్య ఈగోలు వస్తే?
'విద్య వాసుల అహం'లో విద్య పాత్రలో శివాని రాజశేఖర్, వాసుగా రాహుల్ విజయ్ కనిపించనున్నారు. పెళ్ళైన కొత్తలో జంట మధ్య ఈగోలు వస్తే? అనే కథాంశంతో సినిమా రూపొందింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ చేశారు. నగర శివరాల్లో సినిమా కోసం ప్రత్యేకంగా ఓ ఇంటి సెట్ వేశారు. అందులో మెజారిటీ సీన్స్ తీశారని సమాచారం. ఫ్యామిలీ అంతా కలిసి చూసే చిత్రమిదని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. 


'తెల్లవారితే గురువారం' తర్వాత...
ఈ చిత్రానికి మణికాంత్ గెల్లి దర్శకుడు. 'తెల్లవారితే గురువారం' తర్వాత ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది. ఏటర్నిటీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 2గా సినిమా రూపొందింది. లక్ష్మీ నవ్య మక్కపాటి, రంజిత్ కుమార్ కొడాలి సంయుక్తంగా నిర్మించారు. కల్యాణి మాలిక్ సంగీతం అందించారు. త్వరలో పాటల్ని విడుదల చేయడంతో పాటు మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత : మహేష్ దత్త మోటూరు, కూర్పు : సత్య గిడుటూరి, ఛాయాగ్రహణం : అఖిల్ వల్లూరి, రచన: వెంకటేష్ రౌతు.