స్టార్ హీరోయిన్ సమంతా ప్రస్తుతం పెప్సీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. తాజాగా పెప్సీకి సంబంధించిన యాడ్ లో సామ్ తళుక్కున మెరిసింది. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా, తమకు నచ్చినట్లుగా మహిళలు జీవించాలనే సందేశాన్ని ఇస్తూ ఈ యాడ్ రూపొందించారు. ఈ యాడ్ పై కొందరు ప్రశంసలు కురిపిస్తుండగా, మరికొందరు విమర్శలు చేస్తున్నారు.
సమంత యాడ్ మహిళలకు స్ఫూర్తి- సానియా మీర్జా
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సైతం సమంత నటించిన పెప్సీ యాడ్ పై స్పందించింది. ఒక మహిళగా తన అనుభవాల గురించి సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేసింది. సమంత యాడ్ చూసిన తర్వాత తన కెరీర్ లోని ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని చెప్పింది. టెన్నిస్ స్టార్ గా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని చెప్పుకొచ్చింది. తన ఆట గురించి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని వివరించింది. ఒక లేడీ టెన్నిస్ క్రీడాకారిణిగా సాధించేది ఏముంది? ఈ ఆటలో తను ఎంత దూరం వెళ్తుంది? అనే మాటలు వినిపించాయన్నది. సమాజం గురించి తాను పట్టించుకోలేదని, తాను అనుకున్న కల కోసం కష్టపడ్డానని చెప్పింది. అనుకున్న లక్ష్యాలను చేరుకున్నానని వెల్లడించింది. విజయం సాధించాలనే తన లక్ష్యం ముందు సమాజం మాటలు పని చేయలేదని చెప్పింది. సమంత నటించిన ఈ యాడ్ ప్రతి మహిళకు స్ఫూర్తిదాయకంగా ఉందని తెలిపింది. మహిళలు తాము అనుకున్నది సాధించేందుకు ప్రేరణగా నిలుస్తుందని వెల్లడించింది. నిజానికి కెరీర్ ప్రారంభంలో సానియా ఎన్నో ఇబ్బందలు పడింది. ఆమె టెన్నిస్ ఆడే సమయంలో వేసుకునే బట్టలపై ఆమె మత పెద్దల నుంచి తీవ్ర అభ్యంతరాలను ఎదుర్కొంది. ఆమె వ్యక్తిగత జీవితంపైనా పలువురు విమర్శలు చేశారు. వాటన్నింటీ పట్టించుకోకుండా ముందుకు సాగింది సానియా.
‘రైజ్ అప్ బేబీ’ పెప్సీ యాడ్
సమాజంలో ఉన్న లింగ బేధాలను బద్దలుకొట్టే మహిళగా సమంతా కనిపిస్తుంది. సగటు భారతీయ మహిళ ప్రతిరోజూ ఎదుర్కొనే పరిస్థితులను ఇందులో ప్రస్తావించారు. మహిళలు నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని నిలబడాలని చెప్తుంది. ‘‘సమాజం మన కోసం ఏర్పరిచిన మూస పద్ధతులను బద్దలుకొడుతూ మహిళలు ఎల్లప్పుడూ వారి మనసుకు నచ్చినట్లుగా నడుచుకోవాలని గట్టిగా నమ్ముతున్నాను. ఈ యాడ్ నాకు ప్రత్యేకమైనది. మహిళల్లో ఈ యాడ్ ఆత్మవిశ్వాసం పెంపొదిస్తుందని భావిస్తున్నాను. పెప్సీతో అనుబంధం ఏర్పడినందుకు నేను నిజంగా సంతోషిస్తున్నాను. రేజ్ అప్, బేబీ!’’ అని సమంత తెలిపింది.
ఇక సమంత నటించిన పౌరాణిక చిత్రం 'శాకుంతలం' ఇటీవలే విడుదలైన బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం 'అభిజ్ఞాన శాకుంతలం' లోని శకుంతల - దుష్యంతుల ప్రేమగాథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు గుణశేఖర్. ఇందులో సమంత టైటిల్ రోల్ ప్లే చేయగా.. దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించాడు. ప్రస్తుతం ‘సిటాడెట్’ వెబ్ స్టోరీ ఇండియన్ వెర్షన్ లో సమంతా నటిస్తోంది. వరుణ్ ధావన్ తో కలిసి ఆమె స్ర్కీన్ షేర్ చేసుకుంటోంది. రాజ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. అటు విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషీ’ సినిమాలో నటిస్తోంది.
Read Also: ఆర్థిక ఇబ్బందులతో రెండేళ్లు ఇంట్లోనే ఉన్నా, ఆ హీరోయిన్లు నాతో నటించనన్నారు- బెల్లంకొండ శ్రీనివాస్