దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ పరీక్ష రేపు (మే 7) జరగనుంది. మే 7న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య నీట్ యూజీ ప్రవేశ పరీక్ష జరుగనుంది.  పెన్ను, పేపర్‌ విధానంలో దేశవ్యాప్తంగా 499 నగరాలు/పట్టణాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగుతో పాటు 13 భాషల్లో జరిగే ఈ పరీక్షకు దాదాపు 20లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరుకానున్నారని అంచనా. 


అడ్మిట్ కార్డును ప్రింట్ తీసుకొని దాంతో పాటు NTA అడిగిన డాక్యుమెంట్లు, ఫోటోలను తీసుకొని విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. పరీక్ష రాసేవారు ఎగ్జామినేషన్ సెంటర్ కు కనీసం గంటన్నర ముందు చేరుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అడ్మిట్ కార్డుపై గైడ్ లైన్స్ ఉంటాయి. 


దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యూజీ పరీక్షకు మార్చి 6న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అదేరోజు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ 7 వరకు దరఖాస్తులు స్వీకరించారు.


నీట్ యూజీ పరీక్ష విధానం..
➥ నీట్ ప్రవేశ పరీక్ష పూర్తి ఆఫ్‌లైన్‌ (పెన్, పేపర్) విధానంలో నిర్వహిస్తారు. మూడు గంటల 20 నిమిషాల నిడివితో జరిగే ఈ పరీక్షలో ప్రతి సబ్జెక్టు నుండి గరిష్టంగా 45 ప్రశ్నలు చెప్పున మొత్తం 180 ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రశ్నలు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ మరియు జూవాలాజీ సబ్జెక్టులకు సంబంధించి ఉంటాయి.


➥ ఒక్కో సబ్జెక్టు నుంచి రెండు సెక్షన్ల (సెక్షన్-ఎ, బి) వారీగా 50 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-ఎ నుంచి 35 ప్రశ్నలు, సెక్షన్-బి నుంచి 15 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-బి లోని 15 ప్రశ్నల్లో 10 ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అభ్యర్థి సమాధానం చేసిన మొదటి 10 ప్రశ్నలను మాత్రమే లెక్కింపు సమయంలో పరిగణలోకి తీసుకుంటారు.


➥ ప్రతి ప్రశ్న మల్టిఫుల్ ఛాయస్ పద్దతిలో నాలుగు ఆప్షనల్ సమాధానాలు కలిగి ఉంటుంది. అందులో ఒక సరైన సమాధానాన్ని గుర్తించవలసి ఉంటుంది. సరైన సమాధానం చేసిన ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తప్పు సమాధానం ఇచ్చిన ప్రశ్నకు మైనస్ 1 మార్కు ఇవ్వబడుతుంది.


➥ మొత్తం 720 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 10+2/ఇంటర్మీడియట్ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలాజీ) లకు సంబంధించిన సిలబస్ నుండి ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్న పత్రాలు దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది.


నీట్ యూజీ వివరాల కోసం క్లిక్ చేయండి.. 


విద్యార్థులకు ముఖ్య సూచనలు..


➥ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్‌ కార్డుతో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటోను తీసుకెళ్లాలి. ఫొటోను అటెండెన్స్‌ షీట్‌పై అతికించాలి.


➥ అభ్యర్థులు డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరిగా పాటించాలి. పొడవు చేతులున్న డ్రెస్సులు, షూలు, నగలు, మెటల్‌ వస్తువులను లోనికి అనుమతించరు.


➥ స్లిప్పర్లు, తక్కువ ఎత్తున్న శాండిల్స్‌ మాత్రమే వేసుకోవాలి.


➥పేపర్లు, జామెట్రీ/పెన్సిల్‌ బాక్సులు, ప్లాస్టిక్‌ పౌచ్‌లు, కాలిక్యులేటర్లు, స్కేళ్లు, రైటింగ్‌ ప్యాడ్స్‌, పెన్‌డ్రైవ్స్‌, ఎలక్ట్రానిక్‌ పెన్నులు వంటి వాటిని పరీక్ష కేంద్రానికి అనుమతించరు.


➥ చేతికి వాచ్‌లు, వాలెట్లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, బెల్ట్‌లు, టోపీలు వంటివి కూడా ధరించకూడదు.