ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్... ఈ ముగ్గురి కలయికలో రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి... 'ఆర్య'. రెండోది 'ఆర్య 2'. రెండిటిలో స్పెషల్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. 'ఆర్య'లో 'అ అంటే అమలాపురం', 'ఆర్య 2'లో 'రింగ రింగ...' - రెండూ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. అందువల్ల, ఈ ముగ్గురి కలయికలో వస్తున్న మూడో సినిమా 'పుష్ప: ద రైజ్'లో స్పెషల్ సాంగ్ ఎలా ఉంటుందోననే ఆసక్తి ఏర్పడింది. పైగా, సమంత ఆ సాంగ్‌లో సందడి చేయనున్నారనే వార్త అంచనాలు మరింత పెంచింది. ఈ సాంగ్ ఎలా ఉంటుందోననే ఆసక్తికి ఫుల్ స్టాప్ పడింది.
'పుష్ప: ద రైజ్'లో స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా? ఊ ఊ అంటావా?'ను శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. స్పెషల్ సాంగ్స్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించే దేవి శ్రీ ప్రసాద్ డిఫరెంట్ ట్యూన్‌తో వచ్చారు. తెలుగులో ఈ పాటను చంద్రబోస్ రాయగా... ఇంద్రవతి చౌహన్ ఆలపించారు. తమిళంలో ఇదే పాటను సింగర్ అండ్ హీరోయిన్ ఆండ్రియా ఆలపించారు. కన్నడలో తెలుగమ్మాయి మంగ్లీ పాడారు. మలయాళంలో రమ్యా నంబీశన్ పాడారు. ఒక్కో భాషలో ఒకొక్కరి చేత దేవిశ్రీ పాటను పాడించారు.
అల్లు అర్జున్, రష్మికా మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ నెల 17న విడుదల కానుంది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, అజయ్, రావు రమేష్, అజయ్ ఘోష్, ధనుంజయ తదితరులు సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు.
Pushpa Special Song: Oo Antava... Oo Oo Antava Lyrical Video: