స్టార్ హీరోలు ఒకేసారి రెండు, మూడు ప్రాజెక్ట్స్ చేయడం వలన ఒక సినిమాలో వచ్చే చిన్న మార్పు మిగిలిన సినిమాలపై ఎఫెక్ట్ పడేలా చేస్తుంది. ఇప్పుడు ప్రభాస్ విషయంలో కూడా అదే జరుగుతోంది. 'రాధేశ్యామ్' సినిమా ఆలస్యం కావడానికి కారణం.. ప్రభాస్ 'సాహో', 'ఆదిపురుష్' సినిమాలను ముందుగా పూర్తి చేయాలనుకోవడమే. 


ఇప్పుడు 'ఆదిపురుష్' సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నా.. కొన్ని కారణాల వలన మళ్లీ రీషూట్ చేయాలనుకుంటున్నారు. దీని ఎఫెక్ట్ 'సలార్' సినిమాపై పడుతోంది. మొదట ఈ సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఎప్పుడైతే.. 'ఆదిపురుష్' సినిమాను 2023 జనవరిలో రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారో వెంటనే 'సలార్'ను సెప్టెంబర్ కి పుష్ చేశారు. ఇప్పుడు 'ఆదిపురుష్'ని జూన్ 16, 2023లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. 


'ఆదిపురుష్' కోసం ప్రభాస్ మళ్లీ కాల్షీట్స్ కేటాయిస్తే 'సలార్' సినిమా ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఇప్పుడు 'సలార్' మేకర్స్ తమ సినిమాను కూడా వాయిదా వేయాలని అనుకుంటున్నారట. 2023 చివరికి లేదంటే.. 2024 సంక్రాంతికి 'సలార్'ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి!


'సలార్' సినిమాలో ప్రభాస్ సరసన.. శ్రుతి హాసన్ హీరోయిన్‏గా నటిస్తోంది. 'కేజీఎఫ్' సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది.


కొత్త షెడ్యూల్ ను పూర్తి చేసే పనిలో పడింది చిత్రబృందం. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన బస్తీ సెట్ లో షూటింగ్ చేస్తున్నారు. ప్రభాస్ తో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇంకొన్ని రోజులపాటు ఇక్కడే షూటింగ్ నిర్వహించనున్నారు. పక్కా ప్లానింగ్ తో టీమ్ ముందుకెళ్తోంది. ఈ సినిమాకి రవి బస్రూర్ మ్యూజిక్ అందించగా.. భువన గౌడ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ సహా పలు భాషల్లో రిలీజ్ కానుంది. రూ.150 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలంగాణలోని బొగ్గు గనుల్లో కూడా చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమాలో విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ను తీసుకున్నారు.


'సలార్'లో 'అఖండ' షేడ్స్: 

ఈ సినిమాలో 'అఖండ' షేడ్స్ ఉంటాయట. ఆ సినిమాలో సెకండ్ హాఫ్ లో అఘోరా క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విలన్స్ ను వెంటాడి మరీ చంపుతుంది అఘోరా క్యారెక్టర్. 'సలార్' సినిమాలో కూడా ఇలాంటి కొంతమంది భక్తులు కనిపిస్తారట. కాళీ మాతను కొలిచే కొందరు భక్తులు అసాంఘిక కార్యక్రమాలు చేస్తుంటారు. అలాంటి వారితో పోరాటానికి దిగుతాడు సలార్. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలుస్తాయట. కాళీ మాత టెంపుల్ సెట్ ను నిర్మించి అందులో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ సన్నివేశాలు ఫ్యాన్స్ కి ఐఫీస్ట్ అని చెబుతున్నారు. 

Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘ఆదిపురుష్’ విడుదల వాయిదా, తేదీ ప్రకటించిన ఓం రౌత్ - రీషూట్ కోసమేనా?