Salaar First Single: 2023 సంవత్సరం మొత్తంలో మోస్ట్ అవైటెడ్ సినిమా ‘సలార్’. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన విడుదలకు సిద్ధం అవుతోంది. దీంతో ప్రమోషన్లలో కూడా జోరు పెంచారు. ఇటీవలే ట్రైలర్ కూడా విడుదల అయింది. ఇప్పుడు ‘సలార్’ మొదటి పాటను విడుదల చేశారు. ‘సూరీడే’ అంటూ సాగిన ఈ పాటలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రల మధ్య స్నేహాన్ని బాగా చూపించారు.


ఈ పాటలో సినిమాకు సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి. చిన్నప్పటి ప్రభాస్, పృథ్వీరాజ్ పాత్రలకు తల్లి ఈశ్వరి రావు అన్నం తినిపించడం, పృథ్వీరాజ్ పెద్దయ్యాక ఉలిక్కిపడి లేచినప్పుడు ప్రభాస్ ‘నేనున్నాను కదరా... పడుకో’ అని చెప్పడం, ప్రభాస్ ఒళ్లో పృథ్వీరాజ్ పడుకోవడం, ప్రభాస్ సిగరెట్ కాల్చడం వంటి విజువల్స్‌ను ఇందులో చూపించారు. ఈ పాట ట్యూన్ ‘కేజీయఫ్’ తరహా ఇన్‌స్ట్రుమెంటేషన్‌లా అనిపించినప్పటికీ క్యాచీగా ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. ప్రభాస్, పృథ్వీరాజ్ పాత్రల మధ్య కెమిస్ట్రీ చుట్టూనే సినిమా అంతా తిరగనుందని పాట వింటే అర్థం చేసుకోవచ్చు.






‘సలార్’ సినిమా గట్టి పోటీ నడుమ విడుదల అవుతోంది. హిందీ మార్కెట్లో షారుక్ ఖాన్ ‘డంకీ’, ఓవర్సీస్‌లో హాలీవుడ్ బిగ్గీ ‘ఆక్వామేన్: ది లాస్ట్ కింగ్‌డం’ నుంచి ‘సలార్’కు పోటీ ఎదురు కానుంది. రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న ‘డంకీ’ ఎమోషనల్ డ్రామాగా థియేటర్లలో అలరించబోతోంది. ‘ఆక్వామేన్: ది లాస్ట్ కింగ్‌డం’ పూర్తిస్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందిన సూపర్ హీరో సినిమా. ఇలా వివిధ జోనర్ల సినిమాలు ఉండటంతో ‘సలార్’కు ఆశించిన స్థాయిలో వసూళ్లు వస్తాయా లేదా అన్నదానిపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ‘సలార్’ నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.


‘సలార్’ సినిమా విడుదల ఒక పద్దతి ప్రకారం జరుగుతున్నట్లు విజయ్‌ కిరగందూర్‌ పేర్కొన్నారు. మొదట ఈ సినిమాను సెప్టెంబర్ 28వ తేదీన విడుదల కానున్నట్లు ప్రకటించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతోనే ఆ తేదీ నుంచి సినిమా విడుదల వాయిదా పడినట్లు వివరించారు. ఎన్ని సినిమాలు బరిలో నిలిచినా ‘సలార్’ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయనుందని ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చారు.


“గత దశాబ్దకాలంగా సినిమాలను ఒక పద్దతిలో విడుదల చేస్తున్నాం. ‘సలార్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో జాప్యం కారణంగానే విడుదల గతంలో వాయిదా పడింది. సలార్’ విడుదల రోజునే షారుక్ ఖాన్ ‘డంకీ’, హాలీవుడ్ సినిమా ‘ఆక్వామేన్: ది లాస్ట్ కింగ్‌డం’ సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. అయినా మేం రిలీజ్ డేట్ మార్చాలి అనుకోలేదు. ఇటీవల కాలంలో ప్రభాస్‌ నటించిన సినిమాలు కొన్ని అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ఒక నిర్మాతగా నేను గత చిత్రాలతో ఈ సినిమాను పోల్చి చూడలేను. సినిమాకు కథనే కీలకం అని నేను భావిస్తాను. ‘సలార్‌’ కనీవినీ ఎరుగని విజయాన్ని అందుకుంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను ప్రభాస్‌ సినిమాలకు వచ్చే ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో ఉంటాయి. ఈ సినిమాకు కూడా కచ్చితంగా అలాగే ఉండనున్నాయి.” అని చెప్పారు.