సుప్రీమ్ హీరో సాయి తేజ్ (Sai Tej) కథానాయకుడిగా సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు ఓ సినిమాను రూపొందిస్తున్నాయి. ఇదొక మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్. దీనికి కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu) దర్శకత్వం వహిస్తున్నారు. హీరోగా సాయి తేజ్ 15వ సినిమా (SDT 15 Movie) ఇది. త్వరలో టైటిల్ వెల్లడించనున్నారు.
డిసెంబర్ 7న టైటిల్ రిలీజ్
SDT15 Title Glimpse on Dec 7th : బుధవారం (డిసెంబర్ 7న) ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయనున్నట్లు సాయి తేజ్ తెలిపారు. ''కొన్ని రోజుల నుంచి మేం ఓ ప్రత్యేకమైన సినిమా చేస్తున్నాం. మా చిత్ర బృందం అంతా ఎంతో ప్రేమతో కష్టపడి చేసిన సినిమాను మీకు ఎప్పుడు ఎప్పుడు చూపించాలా? అని ఎదురు చూస్తున్నాం'' అని సాయి తేజ్ ట్వీట్ చేశారు.
తెలుగులో 'కాంతార' సంగీత దర్శకుడి రెండో చిత్రమిది
B Ajaneesh Loknath Telugu Movies : బి. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. రీసెంట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'కాంతార' చిత్రానికి ఆయన సంగీతం అందించారు. ఆ సినిమా విజయంలో సంగీతం ఎంత కీలక పాత్ర పోషించిందో... అందరికీ తెలిసిందే. తెలుగులో అజనీష్‌కు రెండో చిత్రమిది. ఇంతకు ముందు సుధీర్ బాబు 'నన్ను దోచుకుందువంటే' చిత్రానికి సంగీతం అందించారు. తెలుగులో డబ్బింగ్ అయిన కన్నడ సినిమాలకు మ్యూజిక్ అందించారు.
సాయి తేజ్ సరసన సంయుక్త
ఈ చిత్రంలో సాయి తేజ్ సరసన సంయుక్తా మీనన్ (Samyuktha Menon) కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా కంటే 'భీమ్లా నాయక్'లో రానా దగ్గుబాటి జోడీగా నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార'లో ఓ కథానాయికగా చేశారు.
Also Read : పవన్‌తో హరీష్ శంకర్ సినిమా ఆగలేదు - వచ్చే వారమే పూజ, సంక్రాంతి తర్వాత
సుకుమార్ (Sukumar) కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్న చిత్రమిది. సాయి చంద్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, సునీల్, అజయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాయి తేజ్‌కు రోడ్ యాక్సిడెంట్ కావడానికి ముందు ఈ సినిమా స్టార్ట్ అయ్యింది. ఆ ప్రమాదం వల్ల కొన్ని రోజులు బ్రేక్ పడింది. మళ్ళీ ఆయన కోలుకున్నాక షూటింగ్ రీ స్టార్ట్ చేశారు. కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి హైదరాబాద్‌లో రెండు సెట్స్ వేశారు. సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి అయ్యిందని సమాచారం.
కొత్త సినిమా స్టార్ట్ చేసిన సాయి తేజ్
ఈ సినిమా సెట్స్ మీద ఉండగా... చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బాపినీడు సమర్పణ, బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మాణంలో సాయి తేజ్ కొత్త సినిమా స్టార్ట్ చేశారు. శుక్రవారం ఆ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. దాంతో జయంత్ పానుగంటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ''సాయి తేజ్‌తో మా నిర్మాణ సంస్థకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆ కారణంగా మా సంస్థలో మరో సినిమా చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమాను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. త్వరలో షూటింగ్ స్టార్ట్ కానుంది. సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అతి త్వరలో తెలియజేస్తాం'' అని నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ చెప్పారు.