CM KCR in Mahabubnagar Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ పాలమూరు పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. మహహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి స‌మీపంలో పాల‌కొండ వ‌ద్ద 22 ఎకరాలలో రూ. 55.20 కోట్లతో నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించారు. అంతకు ముందు కొత్త కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌ పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్, ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 


కలెక్టరేట్ ప్రారంభించిన అనంతరం చాంబర్‌లో కలెక్టర్‌ వెంకట్రావ్‌ను సీట్‌లో కూర్చోబెట్టి పుష్పగుచ్ఛం అందించి సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మహబూబ్ నగర్ కొత్త కలెక్టరేట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఉమ్మడి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు చెందిన ప‌లువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితర నేతలు పాల్గొన్నారు. 


‘ఎవ్వరూ వెయ్యి సంవత్సరాలు బతకరు. ఒకరు కలెక్టర్ అయితే, ఇంకొకరు ఎమ్మార్వో, క్లర్క్ లాంటి ఏదో ఓ స్థాయిలో పని చేసి ఉంటారు. మనం ఆ సమయంలో చేసిన పని జాబ్ సంతృప్తి ఉంటుంది. పీవీ నరసింహరావు ప్రధాని అయ్యారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నల్లగొండ జిల్లాలో రెసిడెన్షియల్ స్కూల్ సర్వేల్ లో ఏర్పాటు చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డి సైతం పీవీ అప్పట్లో ఏర్పాటు చేసిన సర్వేల్ విద్యా సంస్థలో చదువుకున్న విద్యార్థి. అందుకే గురుకులాలు ఏర్పాటు చేసి అన్ని వర్గాల వారికి చదువు అందిస్తున్నాం. గర్భం దాల్చినప్పుడు పేద కుటుంబాల్లో ఆమెను సాకాలి అని బాధపడేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఆ మహిళ గర్భం సమయంలో కోల్పోయే జీతాన్ని సైతం ఇవ్వాలని మేం నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నాం. పోలియో టీకాలు వేసుకుంటే అనారోగ్యం బారిన పడరని అవగాహన కల్పించాం. గర్భవతులైన పేద మహిళలకు మెడిసిన్ అందించడం, ప్రసవం సకాలంలో అయ్యేలా చేయడం, చివరగా కేసీఆర్ కిట్ అందించి వారికి మేలు కలిగేలా చేసిన ఘనత’ తెలంగాణ ప్రభుత్వానిదన్నారు.






టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం..
పాలమూరు పర్యటనలో బిజీగా ఉన్న సీఎం కేసీఆర్ పనిలో పనిగా టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌర‌స్తాలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాల‌యాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్ర‌మంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఉమ్మడి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌కు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర నాయ‌కులు పాల్గొన్నారు. 






ఎంవీఎస్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో సాయంత్రం 4 గంట‌ల‌కు ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.  సాయంత్రం ఐదు గంటలకు హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు. సీఎం కేసీఆర్ పర్యటనకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ రాకతో పాలమూరు పట్టణం గులాబీవర్ణం అయింది. పట్టణంలోని జాతీయ రహదారిని సుందరంగా తీర్చిదిద్ది, రంగురంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. 


ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్‌ నుంచి రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్ బయలుదేరి, 12.45 నిమిషాలకు మహబూబ్‌నగర్‌ చేరుకున్నారు. మార్గం మధ్యలో శంషాబాద్‌, షాద్‌న‌గ‌ర్‌, బాలాన‌గ‌ర్‌, జడ్చర్లలో సీఎం కేసీఆర్ కు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అక్కడ ఇంటిగ్రేటెడ్‌  కాంప్లెక్స్‌ను ప్రారంభించారు. మధ్నాహ్నం 1.15 నిమిషాలకు జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టరేట్‌ ను ప్రారంభించారు. అనంతరం భూత్పూర్‌ దారిలో కొత్తగా నిర్మించిన టీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.