Rajkumar Hirani Collaborated With The Election Commission: రాజ్ కుమార్ హిరానీ. ఆయన తీసింది తక్కువ సినిమాలే అయినా, అన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. సామాజిక అంశాలను బేస్ చేసుకుని రూపొందించే ఆయన చిత్రాలు అద్భుత ప్రేక్షకాదరణ దక్కించుకుంటాయి. ‘మున్నా భాయ్ MBBS’ నుంచి ‘డంకీ’ వరకు ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. 


ఎలక్షన్ కమిషన్ తో చేతులు కలిపిన రాజ్ కుమార్ హిరానీ


ఇప్పటి వరకు తన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన రాజ్ కుమార్ హిరానీ, ఇప్పుడు ఏకంగా భారత ఎన్నికల సంఘంతో చేతులు కలిపారు. ఓటరు అవగాహన కోసం షార్ట్ ఫిలిమ్స్ రూపొందిస్తున్నారు.  జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాజ్ కుమార్ తెరకెక్కించిన షార్ట్ ఫిల్మ్ ‘మై వోట్, మై డ్యూటీ’ విడుదల అయ్యింది. ఇందులో ఓటు విలువ గురించి ఓటర్లలో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ‘మై వోట్, మై డ్యూటీ’ షార్ట్ ఫిలిమ్ లో దిగ్గజ క్రికెటర్ సచిన టెండూల్కర్, బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, ఆర్ మాధవన్, రవీనా టాండన్, విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ, అర్షద్ వార్సీ, రాజ్‌ కుమార్ రావు, భూమి పెడ్నేకర్, మోనా సింగ్ ఓటర్లలో అవగాహన కల్పిస్తూ ఇచ్చిన సందేశాలను పొందుపరిచారు. ఈ షార్ట్ ఫిలిమ్ పై ఈసీ సంతోషం వ్యక్తం చేసింది.  "ప్రతి ఓటు ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తూ ఈ షార్ట్ ఫిలిమ్ రూపొందించడం జరిగింది.  రాజ్‌ కుమార్ హిరానీ నిర్మించారు. సంజీవ్ కిషిన్ చందాని దర్శకత్వం వహించిన ఈ చిత్రం పౌరులు తమ ఓటు ప్రాముఖ్యతను గుర్తించేలా ప్రేరేపించారు. ఈ షార్ట్ ఫిలిమ్ ప్రతి ఒక్క ఓటు విలువను హైలెట్ చేస్తుంది” అని ఈసీ అధికారులు తెలిపారు.


‘డుంకీ’ సినిమాతో మరో హిట్ అందుకున్న రాజ్ కుమార్


100 శాతం సూపర్ హిట్ ట్రాక్ రికార్డు ఉన్న దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ, తాజాగా ‘డుంకీ‘ అనే సినిమాను తెరకెక్కించారు. షారుఖ్ ఖాన్ హీరోగా, తాప్సీ పొన్ను హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. పలు దేశాల రాయబారుల కోసం ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమాలో అక్రమ పద్దతుల ద్వారా గాడిది మార్గాల్లో వలసదారులు ఇతర దేశాల్లోకి ప్రవేశించే విధానాన్ని చూపించారు. ఇమ్మిగ్రేషన్ సమస్యను ఈ సినిమాలో హైలెట్ చేశారు. బాలీవుడ్ టాప్ స్టార్ షారుక్‌ ఖాన్ మాస్‌, రొమాంటిక్ ఇమేజ్‌ ఏమాత్రం ప్ర‌భావితం కాకుండా ఈ సినిమాను రూపొందించారు రాజ్ కుమార్ హిరానీ. ప్రేక్షకులను న‌వ్విస్తూ, అదే సమయంలో కంటతడి పెట్టిస్తూ సినిమా కథను ముందుకు నడిపారు. ఇంగ్లండ్‌లో క‌థ‌ని మొద‌లుపెట్టిన ద‌ర్శ‌కుడు, ఆ త‌ర్వాత పంజాబ్‌ లోని ప‌ల్లెటూరి వరకు తీసుకొస్తారు. ఈ సినిమలో  బోమన్ ఇరానీ, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ ఇతర పాత్రలు పోషించారు. 


Read Also: మహాభారత శాపాలు ఈ జెనరేషన్ కుర్రాడు ఎదుర్కొంటే? - ‘హ్యాపీ ఎండింగ్’ కథ చెప్పేసిన దర్శకుడు కౌశిక్