నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్, పోస్టర్స్ ను విడుదల చేశారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. తాజాగా మరో సినిమా ఓకే చేశారు బాలయ్య. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సినిమా రూపొందుతోంది.
దీనికి హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మాతలు. హీరోగా బాలకృష్ణకు 108వ సినిమా ఇది (NBK 108 Movie). ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్ లో ఇంత బడ్జెట్ తో సినిమా తీయడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు ఆయన తీసినవన్నీ మీడియం బడ్జెట్ సినిమాలే. తొలిసారి బాలయ్య సినిమా కోసం రూ.80 కోట్ల బడ్జెట్ కోట్ చేశారు.
కథ మీద నమ్మకంతో నిర్మాతలు అంత మొత్తం ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారు. బాలయ్య నటించిన 'అఖండ' సినిమాను రూ.65 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. #NBK107 కోసం రూ.70 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు ఈ రెండు సినిమాలకు మించి #NBK108 కోసం ఖర్చు పెట్టబోతున్నారు. ఈ సినిమా కథ ప్రకారం.. బాలయ్యకి కూతురు కూడా ఉంటుందట. ఆ పాత్రలో హీరోయిన్ శ్రీలీల కనిపించబోతుంది. తెలుగమ్మాయి, మరో హీరోయిన్ అంజలి కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఆమెది విలన్ రోల్ అని టాక్.
అతి త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసి... నెక్స్ట్ ఇయర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారట. బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా జూన్ 10న ఈ సినిమాలో బాలయ్య లుక్ విడుదల అవుతుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ, ఆ రోజు విడుదల చేయలేదు. సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి సమయం ఉంది కాబట్టి లుక్ తర్వాత రివీల్ చేయాలని భావిస్తున్నారట. బాలకృష్ణ క్యారెక్టర్ మాత్రమే కాదు, ఆయన లుక్ కూడా సమ్‌థింగ్ స్పెషల్ అన్నట్లు ఉంటుందట. ఈ చిత్రానికి 'ఐ డోంట్ కేర్' టైటిల్ ఖరారు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.
బాలయ్యతో ప్రయోగం:
ఈ సినిమా గురించి గతంలో దర్శకుడు అనిల్ రావిపూడి కొన్ని విషయాలను వెల్లడించారు. ఇప్పటివరకు బాలయ్యను ఎవరూ ఈ కోణంలో చూపించలేదని.. తన మనసులో బాలయ్యను ఓ కొత్త కోణంలో చూస్తున్నానని.. కొత్తగా ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి. సినిమా విడుదలైన తరువాత బాలయ్యను ఇలా కూడా చూపించొచ్చా అనేలా ఉంటుందని తెలిపారు. అలానే బాలయ్య స్టైల్, మాస్ లుక్, డైలాగ్స్ అన్నీ ఉంటాయని.. వీటితో పాటు తను అనుకుంటున్న కోణం కూడా ఉంటుందని చెప్పారు. ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి తన బ్రాండ్ ను పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో తన మార్క్ కామెడీ ఉండదని స్పష్టం చేశారు. పూర్తిగా తన ఇమేజ్ ను పక్కనపెట్టి, బాలయ్యతో ప్రయోగం చేస్తున్నానని తెలిపారు అనిల్ రావిపూడి.
Also Read : రేపిస్టులను వదిలేస్తారా? గుజరాత్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వానికీ పూనమ్ కౌర్ చురకలు?
Also Read : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ