దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న 'ఆర్ఆర్ఆర్' సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయంలో రోజుకో డేట్ వినిపిస్తోంది. దసరా కానుకగా విడుదల చేస్తామని చెప్పి.. ఇప్పుడేమో పోస్ట్ పోన్ చేశారు. వచ్చే ఏడాది ఉగాది కానుకగా సినిమా రిలీజ్ అవుతుందని టాక్ వచ్చింది. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రానుందని అంటున్నారు. ఈ విషయం బాలీవుడ్ మీడియా వర్గాల ద్వారా బయటకు వచ్చింది. 

 


 

ఈ సినిమా హిందీ హక్కులను తీసుకున్న పెన్ మూవీస్ సంస్థ కొత్త రిలీజ్ డేట్ విషయంలో ఎగ్జిబిటర్లను అలర్ట్ చేసినట్లు సమాచారం. బాలీవుడ్ ట్రేడ్ సమాచారం ప్రకారం.. 2022 జనవరి 12న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. బాలీవుడ్ లో సంక్రాంతి సమయానికి ఏ సినిమా రావడం లేదు. అది కూడా 'ఆర్ఆర్ఆర్'కి కలిసొస్తుందని భావిస్తున్నారు. కానీ రాజమౌళి అదే డేట్ ని లాక్ చేస్తే గనుక టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరగడం ఖాయం. 

 

ఎందుకంటే అదే సమయానికి పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్', ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్', మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. నిజానికి 'ఆర్ఆర్ఆర్' సినిమా దసరా రిలీజ్ అన్నప్పుడు మిగిలిన సినిమాలన్నీ సంక్రాంతికి రావాలనుకున్నాయి. అదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశాయి. కానీ ఇప్పుడు మళ్లీ 'ఆర్ఆర్ఆర్' డేట్ మార్చుకొని సంక్రాంతికి వస్తే.. మిగిలిన సినిమాలు ఈ విషయంలో వెనక్కి తగ్గుతాయని అనుకోలేం. 'ఆర్ఆర్ఆర్' వచ్చినా.. కూడా దాంతో పాటు తమ సినిమాలను కూడా బరిలోకి దింపే ఛాన్స్ ఉంది. మరేం జరుగుతుందో చూడాలి!