ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులందరూ 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నారు. అక్టోబర్ 13న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా దేశంలో పేరు గాంచిన ఐదుగురు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ తో ఓ పాటను రూపొందించారు.
'దోస్తీ' అంటూ సాగే ఈ పాటను స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నాడు చిత్రబృందం విడుదల చేసింది. టాలీవుడ్ సింగర్ హేమచంద్రతో పాటు అనిరుధ్ రవిచందర్, అమిత్ త్రివేది, యాసిన్ నజీర్, విజయ్ ఏసుదాస్ ఈ పాటలో భాగమయ్యారు. స్నేహం విలువ చాటిచెప్పేలా ఈ పాటను రూపొందించారు.
ఇందులో రామ్ చరణ్ అగ్గికి ప్రతిబింబంలాంటి పాత్రను పోషిస్తుండగా.. నీటిని ప్రతిరూపం లాంటి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించనున్నాడు. పరస్పర విరుద్ధమైన ఈ పాత్రలు ఒక్కటైతే.. వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందో ఈ పాటలో చూపించారు. సినిమా కథను ప్రతిబింబించేలా లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతంగా ఈ పాటను రాశారు. సినిమా ఎసెన్స్ అంతా ఈ పాటలోనే కనిపిస్తుంది.
ఈ వీడియో చూసిన తరువాత రాజమౌళి మేకింగ్, కీరవాణి సంగీతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సినిమాలో హీరోల పాత్రలను ఈ ఒక్క పాటలోనే వివరించేశారు. ఈ పాట చిత్రీకరణ చూస్తుంటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఐదు నిమిషాల నిడివితో సాగిన ఈ పాటను విన్నాక గూస్ బంప్స్ రావడం ఖాయం. ఇక పాట చివర్లో రామ్ చరణ్-ఎన్టీఆర్ లు ఇద్దరూ నడుచుకుంటూ రావడం మరో హైలైట్.
థీమ్ సాంగే ఈ రేంజ్ లో ఉంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. సినిమాలో ఈ పాట మేకింగ్ కూడా ఓ రేంజ్ లో ఉంటుందట. తెలుగులో ఈ పాటను హేమచంద్ర పాడగా.. హిందీలో అమిత్ త్రివేది.. తమిళంలో అనిరుద్.. కన్నడలో యాజిన్ నైజర్.. మలయాళంలో విజయ్ ఏసుదాస్ ఆలపించనున్నారు. తన గొంతుతో పాటకు ప్రాణం పోశాడు హేమచంద్ర. ఈ ఒక్క పాటతోనే సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకోవడం ఖాయం.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా అలియా భట్.. ఎన్టీఆర్ కి జోడీగా ఒలీవియా మోరీస్ కనిపించనున్నారు. వీరితో పాటు రేయ్ స్టీవ్‌సన్, ఆలిసన్ డ్యూడీ, శ్రియ, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖనిలు కీలకపాత్రలు పోషించారు.