దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలను పరిచయం చేస్తూ కొన్ని వీడియోలను వదిలారు. మిగతా పాత్రధారులను పరిచయం చేస్తూ... పోస్టర్లు, స్టిల్స్ విడుదల చేశారు. ఇటీవల దీపావళి సందర్భంగా 'ఆర్‌ఆర్‌ఆర్' గ్లింప్స్ ను విడుదల చేసి సినిమాపై అంచనాలను ఓ రేంజ్ లో పెంచేశారు.
కొన్నిరోజుల క్రితం సినిమాలో 'దోస్తీ' సాంగ్ ను విడుదల చేయగా.. తాజాగా 'నాటు నాటు' అంటూ సాగే సెకండ్ సాంగ్ ను విడుదల చేశారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. ఐదు భాషల్లో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఫ్యాన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా ఈ పాటపై స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
సమంత అయితే 'మెంటల్' అంటూ పాటను షేర్ చేసింది. దర్శకుడు బాబీ 'వాటే ఊరనాటు సాంగ్' అంటూ కామెంట్ చేశాడు. హీరో శివ కార్తికేయన్, రచయిత సాయిమాధవ్ బుర్రా.. ఇలా చాలా మంది సెలబ్రిటీలు పాటకి ఫిదా అవుతూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరీస్, రామ్ చరణ్ జంటగా ఆలియా భట్ నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, అలీసన్ డూడీ, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి