Royal Albert Hall presents RRR Live Concert : లండన్‌లోని ఐకానిక్ రాయల్ ఆల్బర్ట్ హాల్ గురించి సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. 148 సంవత్సరాల ఘనత కలిగిన ఈ థియేటర్ లో ఎన్నో ప్రపంచ ప్రఖ్యాత చిత్రాలు ప్రదర్శించారు. వీటిలో ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలే ఉంటాయి. ఈ థియేటర్ లో ప్రదర్శించబడిన తొలి ఇంగ్లీషేతర మూవీగా ‘బాహుబలి: ది కన్ క్లూజన్’ గుర్తింపు తెచ్చుకుంది. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఆక్టోబర్ 19, 2019లో ఈ సినిమాను ఐకానిక్ రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శించారు.
‘బాహుబలి 2’ తర్వాత ‘RRR’
‘బాహుబలి 2’ సినిమాను ప్రదర్శించిన 5 సంవత్సరాల తర్వాత.. రాజమౌళి దర్శకత్వం వహించిన మరో చిత్రం ‘RRR’ కూడా ప్రపంచ ప్రఖ్యాత థియేటర్ లో ప్రదర్శించబోతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన యాక్షన్ డ్రామాను మే11, 2025న రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఆస్కార్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ లైవ్ ఫిల్మ్ ఇన్ కాన్సర్ట్ లో ప్రతిష్టాత్మక రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా ద్వారా ప్రదర్శన ఇవ్వబోతున్నారు.
‘RRR’ సినిమా గురించి..
ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అద్భుత విజయాన్ని అందుకుంది. పలు భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ సినిమా అన్ని చోట్లా మంచి వసూళ్లు సాధించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియ సహా పలువురు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా మార్చి 25, 2022న విడుదలైంది. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. ఈ చిత్రం ఏకంగా రూ. 1,120 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక ‘నాటు నాటు’ పాట గ్లోబల్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ప్రపంచం అంతా ఈ పాటకు చిందేసింది. అంతేకాదు, 95వ అకాడమీ అవార్డ్స్ లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డును అందుకుంది. హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్, గోల్డెన్ గ్లోబ్స్ సహా పలు అంతర్జాతీయ పురస్కారాలను దక్కించుకుంది.
జపాన్ లో ‘RRR’ సినిమా స్పెషల్ క్రేజ్
‘RRR’ సినిమా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా మార్మోగేలా చేసింది. ఈ సినిమాకు ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఈ సినిమాను పలు దేశాల్లో రీ రిలీజ్ చేశారు. జపాన్ లో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యామిలీలతో కలిసి మరీ వెళ్లి ‘RRR’ సినిమాను ప్రమోట్ చేసారు. ఈ సినిమా విడుదల తర్వాత ఆ దేశంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు రాజమౌళికి స్పెషల్ గా ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
Read Also: తెలుగు సినిమాల బాటలో ‘కంగువా’, తెల్లవారుజాము నుంచే షోలు షురూ!