Kanguva Movie Release : తెలుగు సినిమా పరిశ్రమలో గత కొంతకాలంగా కొత్త ట్రెండ్ మొదలయ్యింది. ఈ మధ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పలు సినిమాలు తెల్లవారుజాము నుంచే షోలు వేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘గుంటూరు కారం’ నుంచి మొదలైన ఈ పద్దతి ప్రభాస్ ‘సలార్’,  జూ. ఎన్టీఆర్ ‘దేవర’ వరకు వేకువజామునే షోలు పడ్డాయి. ఇప్పటి వరకు ఎర్లీ మార్నింగ్ ఆటలు వేసిన సినిమాలన్నీ తెలుగు సినిమాలు. కానీ, ఇప్పుడు తొలిసారి ఓ డబ్బింగ్ సినిమా ఈ ట్రెండ్ ఫాలో అవుతోంది.


తెల్లవారుజామున 4 గంటల నుంచే ‘కంగువా’ షోలు


తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువా’ ఈ నెల 14న థియేటర్లలోకి అడుగు పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 35 భాషల్లో విడుదల అవుతోంది. ఈ సినిమా ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేస్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. రూ. 2 వేల కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందన్నారు. ఈ నేపథ్యంలోనే ‘కంగువా’ సినిమాకు సంబంధించిన షోలను ఎర్లీ మార్నింగ్ 4 గంటల నుంచే వేయనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటకలోనూ ఇదే సమయాన్ని పాటిస్తున్నారు. ఈ విషయాన్ని ‘కంగువా’ నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించింది.






ఇంకా అనుమతి ఇవ్వని తమిళనాడు ప్రభుత్వం


ఎర్లీ మార్నింగ్ షోలకు తమిళనాడు ప్రభుత్వం ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదు. గతంలో తమిళనాడులో ఎర్లీ మార్నింగ్ షోలు వేశారు. కానీ, కొన్నిసార్లు అభిమానుల అత్యుత్సాహం కారణంగా ప్రమాదాలు జరిగాయి. ఇద్దరు ముగ్గురు ప్రేక్షకులు చనిపోయారు. అప్పటి నుంచి ఎర్లీ మార్నింగ్ షోలకు అనుమతులు ఇవ్వడం మానేసింది. ‘కంగువా’ సినిమాకు కూడా అనుమతులు ఇవ్వకపోవచ్చని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కానీ, తాము ప్రయత్నం చేస్తూనే ఉన్నామని మేకర్స్ వెల్లడించారు.   


‘కంగువా’ అనుకున్న సమయానికే విడుదల అవుతుందా?   


‘కంగువా’ సినిమా నవంబర్ 14న విడుదలకానున్న నేపథ్యంలో రిలయన్స్ సంస్థ కోర్టులో కేసు వేసింది. చిత్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ తమ దగ్గర అప్పు చెల్లించలేదని, ఆ డబ్బు ఇచ్చేంత వరకు ‘కంగువా’ విడుదలను నిలిపివేయాలని కోరింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. సినిమా విడుదలకు ఇంకా 10 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఈలోగా ఇష్యూని సెటిల్ చేసుకుంటే ఒకే. లేదంటే ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉంటుంది.



శివ దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ డ్రామాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నెగెటివ్ రోల్ పోషిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.



Read Also: ‘క’ స్ట్రీమింగ్ రైట్స్ ఆ ఓటీటీ చేతికే, ప్రేక్షకుల ముందుకు వచ్చేది ఎప్పుడంటే?