Rocky Aur Rani Kii Prem Kahaani Teaser: బాలీవుడ్ లో కరణ్ జోహార్ కు ఎలాంటి క్రేజ్ ఉందో తెలిసిందే. కరణ్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ ఖహాని’ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో రణవీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. ఈ మూవీ టీజర్ ను తాజాగా షారుఖ్ ఖాన్ చేతుల మీదుగా విడుదల చేశారు. టీజర్ విడుదలైన కొద్ది నిమిషాలలో భారీగా వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 


ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలోనే..


టీజర్ విడుదలైన మొదటి గంటలోనే దాదాపు రెండు లక్షల 50 వేల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ మూవీపై ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్నారో తెలుస్తోంది. అంతే కాకుండా 2019 లో వచ్చిన ‘గల్లీ బాయ్’ సినిమా తర్వాత రణవీర్, ఆలియా కలసి ఈ మూవీలో కలిసి కనిపించనున్నారు. అలాగే దర్శకుడు కరణ్ జోహార్ కూడా దాదాపు 7 సంవత్సరాల తర్వాత ఈ మూవీతో దర్శకుడిగా మారారు. దీంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగింది. ఇక టీజర్ విషయానికొస్తే.. కరణ్ జోహార్ సినిమాలంటే ఎక్కువగా ఫ్యామిలీ డ్రామా మూవీస్ గుర్తొస్తాయి. ఈ సినిమా కూడా అలాంటి ఫ్యామిలీ డ్రామా మూవీలానే అనిపిస్తుంది. ఈ మూవీలో కూడా రణవీర్, అలియా లవ్ ట్రాక్ అలాగే ఫ్యామిలీ డ్రామా సన్నివేశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు కరణ్ మార్క్ కలర్ఫుల్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. మూవీలో స్టార్ కాస్ట్ కూడా పెద్దదే ఉంది. 1 నిమిషం 19 సెకన్ల ఈ టీజర్‌ లో ఫ్యామిలీ, డ్యాన్స్, డ్రామా, రొమాన్స్, ట్విస్ట్‌లతో నిండిపోయిందనే చెప్పాలి. ఈ టీజర్ చూస్తుంటే కరణ్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ మూవీ 'కభీ ఖుషీ కభీ ఘమ్' గుర్తొస్తుంది. మరి ఈ మూవీ ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి. 


ఇప్పుడే ఆట మొదలైంది: అలియా


అలియా భట్ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తుంది. ఆమె తాజాగా నటించిన ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ ఖహాని’ టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ను తన సోషల్ మీడియా ఖాతాలో కూడా షేర్ చేసింది అలియా. దానితో పాటు ఓ నోట్ ను కూడా రాసుకొచ్చింది. ‘‘ప్రస్తుతానికి మిమ్మల్ని టీజర్ తో ఖుషీ చేస్తున్నాము అసలు కథ ఇప్పుడే మొదలైంది’’ అంటూ రాసుకొచ్చింది. అలాగే రణవీర్ సింగ్ కూడా ఈ టీజర్ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ మూవీలో ధర్మేంద్ర, జయా బచ్చన్, షబానా అజ్మీలు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీ జూలై 28 ప్రేక్షకుల ముందుకు రానుంది.